చంద్రగిరి నియోజకవర్గంకు లోకేష్ యాత్రకు వెళ్లామని.. అప్పుడు ఓ తల్లి, బిడ్డ వచ్చి తన కుమార్తెను గంజాయికి అలవాటు చేశారని ఏం చేయాలని అడిగారని హోంమంత్రి అనిత తెలిపారు. ‘‘ ప్రభుత్వంలోకి రాగానే గంజాయిపై దృష్టిపెట్టాలి అని ఆ రోజు లోకేష్ చెప్పారు’’ అని తెలిపారు. ఏజెన్సీ ఏరియాలో పండే గంజాయి ఇప్పుడు స్కూలు బ్యాగ్‌లలోకి వచ్చేశాయన్నారు. గంజాయిని అరికట్టడానికి సిస్టంను రిపేర్ చేశామని.. గంజాయి విషయంలో ఉన్న చెక్ పోస్టులు రెండు మాత్రమే అని , సిసి కెమెరాలు ఉన్నాయని తెలిపారు. ఈ ఐదు నెలల కాలంలోనే పాతిక వేల మందిని పట్టుకుని జైలుకు పంపారన్నారు. రాజమండ్రిలో ఓ ఫార్మసిస్టు.. ఖైదీకి గంజాయి అందిస్తున్నట్టు సిసి కెమెరాల్లో కనిపించిందన్నారు. గంజాయి నిరోధానికి ప్రత్యేక వింగ్ ఇచ్చి 469 మంది సిబ్బందికి ఇచ్చామని తెలిపారు. పోలీసు డిపార్ట్మెంట్‌లో కూడా మార్పు వచ్చిందని హోంమంత్రి అనిత వెల్లడించారు. గంజాయిపై ఈ సెషన్‌లో గానీ వచ్చే సెషన్‌లో గానీ స్వల్పకాలిక చర్చ జరపాలని మంత్రి నారా లోకేష్ కోరగా.. సమయం చూసి స్వల్పకాలిక చర్చపై నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు తెలిపారు.