టాటా కన్సల్టెన్సీ సర్వీస్ సంస్థ (టీసీఎస్) మూడు నెలల్లో విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో వెల్లడించారు. విశాఖపట్నంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా ఎమ్మెల్యేలు గురువారం అసెంబ్లీలో గళమెత్తారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో మిలీనియం టవర్లు, స్టార్టప్ విలేజీ భవనాలు ఖాళీగా ఉంచారని, హెచ్‌ఎస్‌బీసీ, ఐబీఎం వంటివి వ్యాపారాలు మానుకున్నాయని అన్నారు. ఐటీ కంపెనీలు ఉన్న రుషికొండ ప్రాంతం సాయంత్రం ఆరు దాటితే నిర్మానుష్యంగా మారిపోతున్నదన్నారు. రహదారులు, 24/7 విద్యుత్, మంచినీటి సదుపాయం, తదితర మౌలిక వసతులు కల్పించాలన్నారు.
టీసీఎస్‌ను నిర్ణీత గడువులోగా తీసుకురావాలని, ఐటీ కంపెనీలకు పెండింగ్‌లో ఉన్న రాయితీలను విడుదల చేయాలని కోరారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, విశాఖలో నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేలు జీతాలు ఇచ్చే ఐటీ కంపెనీలు ఉన్నాయని, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో రూ.50 వేలు ఇస్తున్నారన్నారు. అలాంటి పెద్ద కంపెనీలను విశాఖపట్నానికి తీసుకురావాలని కోరారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎస్‌టీపీఐ కేంద్రం ఏర్పాటుకు రూ.40 కోట్లు ఇస్తామని ముందుకువస్తే గత ప్రభుత్వం ఎకరా భూమి ఇవ్వలేకపోయిందన్నారు. మెరుగైన ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం నిక్సీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరినా పట్టించుకోలేదని ఆరోపించారు. స్టార్టప్ విలేజ్‌లో 150 కంపెనీలు ఉంటే వైసీపీ ప్రభుత్వం వారిని బయటకు గెంటేసిందన్నారు. రెంటల్ పాలసీకి స్పందించి అనేక కొత్త కంపెనీలు వస్తే వారికి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వలేదన్నారు. హైదరాబాద్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైటెక్ సిటీగా అభివృద్ధి చేసినట్టు, విశాఖను లోకేశ్ ఐటీ రంగంలో అభివృద్ధి చేయాలని కోరారు. ఎమ్మెల్యేల ప్రశ్నలకు మంత్రి లోకేశ్ సమాధానమిస్తూ విశాఖపట్నాన్ని డేటా సెంటర్ల హబ్‌గా అభివృద్ధి చేస్తామని ఇప్పటికే ప్రకటించామని, ఆ దిశగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఐటీ కంపెనీలకు రాయితీల కోసం రూ.500 కోట్లు బడ్జెట్‌లో కేటాయించామని, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లో కూడా ఐటీకి కో వర్కింగ్ స్పేస్ అందుబాటులోకి తేవడానికి యత్నాలు జరుగుతున్నాయన్నారు.