అదానీతో చేసుకున్న ఒక్క డీల్‌లోనే జగన్‌కు రూ.1,750 కోట్ల లంచం ముట్టింది. గత ఐదేళ్లలో అదానీతో ఆయన ఎన్నో ఒప్పందాలు చేసుకున్నారు. వాటన్నింటికీ కలిపి ఇంకెంత లంచం ముట్టి ఉంటుంది?’ అంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రాన్ని అదానీకి బ్లాంక్ చెక్కులాగా జగన్ రాసిచ్చారని, ఆంధ్రప్రదేశ్‌ను అదానీప్రదేశ్‌గా మార్చేశారని ధ్వజమెత్తారు. ఇది రాష్ట్రానికే కాకుండా.. వైఎ్‌సఆర్ కుటుంబానికీ అవమానమని అన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో అదానీతో జగన్ చేసుకున్న ఒప్పందాలన్నింటినీ సమీక్షించాలని, వాటిపైన విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబును ఆమె డిమాండ్ చేశారు. సోలార్ విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి అదానీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి, ఆయన కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని కోరారు. అదానీ, జగన్ లంచాల బాగోతంపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని, ఇది దేశానికి, రాష్ట్రానికి, వైఎ్‌సఆర్ కుటుంబానికీ అవమానమని ఆవేదన వ్యక్తం చేశారు. అదానీ దేశం పరువు తీస్తే.. జగన్ రాష్ట్రం పరువు తీశారని మండిపడ్డారు.