అమలాపురంలోని కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ ఫౌండేషన్, కర్నూలులోని విశ్వభారతి మెడికల్ కాలేజీలలో పెరిగిన 75 సీట్లను నీట్ పరీక్షలో ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయాలని హైకోర్టు పేర్కొంది. వీటితోపాటు తమ ఆదేశాలతో కర్నూలు మెడికల్ కాలేజీలో నిలిపి ఉంచిన ఒక సీటును కూడా ప్రతిభావంతులకే కేటాయించాలని తెలిపింది. అదేవిధంగా ఆయా సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అందరికీ అవకాశం కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
నీట్లో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులందరికీ ఈ 76 సీట్ల భర్తీలో అవకాశం ఇవ్వకుంటే ప్రయోజనం ఉండదని, అంతగా ప్రతిభలేని వారికి ఈ సీట్లు దక్కుతాయని పేర్కొంది. ఈ ఉత్తర్వుల కాపీలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) డైరెక్టర్, ఎన్టీఆర్ హెల్త్ యునివర్సిటీ రిజిస్ట్రార్‌కు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ జి. నరేందర్, జస్టిస్ ఎం. కిరణ్మయితో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను మంగళవారానికి(నేడు) వాయిదా వేసింది.