మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి.. ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. బీజేపీ-షిండే శివసేన-అజిత్ పవార్ ఎన్సీపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకుని తిరిగి అధికారాన్ని దక్కించుకుంది. అయితే ప్రభుత్వ ఏర్పాటుపై మాత్రం ఇంకా స్పష్టత రావడం లేదు. ఇందుకు ప్రధాన కారణం సీఎం ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్ తేలకపోవడమే. ఈ నేపథ్యంలోనే బీజేపీ హైకమాండ్ ముగ్గురు నేతలను పిలిచి చర్చలు జరిపింది. 4 రోజులుగా సీఎం ఎంపికపై తీవ్ర కసరత్తు జరుగుతున్నా.. చిక్కుముడి వీడటం లేదు. ఈ క్రమంలోనే షిండే శివసేన ప్లాన్ బీతో రెడీగా ఉన్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కావాలని పట్టుబడుతున్న ఏక్నాథ్ షిండే.. తాజాగా కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ సీఎం పదవి ఇవ్వకపోతే రాష్ట్ర హోంశాఖ, అర్బన్ డెవలప్మెంట్ శాఖలను కోరుతున్నట్లు తెలుస్తోంది. సీఎం పదవి దక్కని సమయంలో.. ఈ ప్లాన్-బీని అమలు చేయాలని.. మహాయుతి కూటమి నేతల వద్ద ఏక్నాథ్ షిండే ప్రస్తావించినట్లు సమాచారం. ఇక బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. షిండే శివసేన నేతల మధ్య మంగళవారం రాత్రి భేటీ జరిగింది.
ఈ సమావేశంలోనే షిండే శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే ఈ రెండు శాఖలు ఇవ్వాలని పట్టుబట్టినట్లు సంబంధిత వర్గాలు చెప్పినట్లు మీడియా కథనాలు వెల్లడవుతున్నాయి. ఇక ముఖ్యమంత్రి పదవిని దేవేంద్ర ఫడ్నవీస్‌కు అప్పగించాలని చూస్తున్న బీజేపీ.. తమ పార్టీకి హోంశాఖ సహా మొత్తం 20 బెర్తులు కేబినెట్లో తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. మరోవైపు.. అజిత్ పవార్‌కు తిరిగి విద్యుత్ శాఖ అప్పగించాలని భావిస్తోంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన మహాయుతి కూటమి.. ప్రభుత్వ ఏర్పాటుపై మాత్రం ముందుకు సాగలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు బీజేపీ హైకమాండ్ అన్ని చర్యలు చేపడుతోంది. ఇక మహారాష్ట్ర అసెంబ్లీ గడువు మంగళవారంతో ముగియనుండగా.. అంతకు కొన్ని గంటల ముందే సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా చేశారు. దీంతో షిండే రాజీనామాను ఆమోదించిన గవర్నర్.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేవరకు తాత్కాలిక సీఎంగా కొనసాగాలని విజ్ఞప్తి చేశారు.