ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిసెంబర్ 7న నిర్వహించే స్కూల్ విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశానికి సిద్దంగా ఉండాలని.. ఈ మేరకు అందరికి ఆహ్వానం పలుకుతూ లేఖ రాశారు. ఈ మెగా సమావేశానికి ప్రజాప్రతినిధులతో పాటుగా దాతలు, పూర్వ విద్యార్థులు, స్వచ్చంధ సంస్థలను ఆహ్వానిస్తున్నాము అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యావ్యవస్థకు అతి పెద్ద పండుగగా డిసెంబర్ 7న తల్లిదండ్రులు - ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ మెగా సమావేశం పాఠశాలల బలోపేతానికి, విద్యార్థి వికాసానికి, సమస్యల పరిష్కారానికి దిక్సూచిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు అతీతంగా అందరూ హాజరుకావాలని కోరారు లోకేష్.
లోకేష్ లేఖలో.. 'అందరికీ నమస్కారం. పాఠశాల విద్యావ్యవస్థకే అతి పెద్ద పండుగగా రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 7వ తేదీన నిర్వహించనున్న తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం లో పాల్గొని విజయవంతం చేస్తారని కోరుతున్నాను. ఈ సమావేశం పాఠశాలల బలోపేతానికి, విద్యార్థి వికాసానికి, సమస్యల పరిష్కారానికి దిక్సూచిగా నిలుస్తుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య ఓ ఆత్మీయ వారధిని నిర్మిస్తుంది. ఎడ్యుకేట్, ఎంగేజ్, ఎంపవర్ లక్ష్యాలతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రమంతా ఒకేసారి డిసెంబర్ 7న విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం పండుగ వాతావరణంలో నిర్వహించాలని నిర్ణయించాం. ఇందులో వార్డు సభ్యుల నుంచి పార్లమెంటు సభ్యుల వరకూ.. సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకూ ప్రజాప్రతినిధులు అందరూ రాజకీయాలకు అతీతంగా.. మీ, మీ పరిధి పాఠశాలలు, మీ సమీప స్కూళ్లలో జరిగే మెగా పేరెంట్-టీచర్ మీటింగ్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను' అన్నారు.
'ఈ సమావేశం ద్వారా పిల్లల చదువు, ప్రవర్తన, క్రమశిక్షణ తల్లిదండ్రులు తెలుసుకోవచ్చు. పిల్లల సమస్యలు, అభ్యసనా సామర్థ్యాలు, క్రీడలు, కళలు పట్ల ఆసక్తులను టీచర్ ముందుంచి వారిని మరింతగా ఆయా అంశాల్లో పరిణతి సాధించేలా ప్రోత్సహించవచ్చు. విద్యావ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచడం.. విద్య నేర్చుకునే పిల్లలు, వారి తల్లిదండ్రులను పాఠశాలలకు దగ్గర చేయడం అనేది మన ప్రభుత్వం లక్ష్యం. పేరెంట్-టీచర్ మీటింగ్కు హాజరయ్యే ప్రజాప్రతినిధులు అందరూ ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. మీ పార్టీ జెండాలు. కండువాలు, రంగులు వేసుకుని రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. పాఠశాలలకు విరాళాలు ఇచ్చిన దాతలు, పాఠశాలల అభివృద్ధికి దోహదపడే పూర్వవిద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా డిసెంబర్ 7న జరగబోయే మెగా పేరెంట్- టీచర్ మీటింగ్లో భాగం కావాలని మనస్పూర్తిగా కోరుతూ అందరికీ ఇదే నా ఆత్మీయ ఆహ్వానం' అంటూ లేఖలో పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్.
డిసెంబర్ 7న జరిగే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పాల్గొంటున్నారు. బాపట్లలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. గతంలోనే ఈ సమావేశాన్ని నిర్వహించాలని భావించారు.. కానీ వాయిదా పడింది. చివరికి డిసెంబర్ 7న ముహూర్తం ఫిక్స్ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్ని ఆహ్వానిస్తూ లేఖ రాశారు.