ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ, మానవవనరుల శాఖా మంత్రి నారా లోకేష్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డిసెంబర్ 7న తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల మెగా సమావేశం నిర్వహించాలని మంత్రి నిర్ణయించారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఈ మెగా సమావేశానికి ప్రజాప్రతినిధులు, దాతలు, పూర్వ విద్యార్థులు, స్వచ్చంధ సంస్థలను ఆహ్వానిస్తూ మంత్రి లోకేష్ శుక్రవారం లేఖను విడుదల చేశారు. విద్యావ్యవస్థకు అతి పెద్ద పండుగగా రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 7న నిర్వహించనున్న తల్లిదండ్రులు - ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.పాఠశాలల బలోపేతానికి, విద్యార్థి వికాసానికి, సమస్యల పరిష్కారానికి దిక్సూచిగా నిలుస్తుందన్నారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య ఓ ఆత్మీయ వారధిగా సమావేశం ఉండనుందన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రమంతా ఒకేసారి డిసెంబర్ 7న విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం జరుగనుందని తెలిపారు. సమావేశాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. వార్డు సభ్యుల నుంచి పార్లమెంటు సభ్యుల వరకూ... సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రజాప్రతినిధులు అందరూ రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని కోరారు. ఒకే పాఠశాలలో కాకుండా వారి వారి గ్రామాల పాఠశాలల్లో జరిగే మెగా పేరెంట్- టీచర్ మీటింగ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం ద్వారా పిల్లల చదువు, పరివర్తన, క్రమశిక్షణను తల్లిదండ్రులు తెలుసుకోవచ్చి మంత్రి లోకేష్ లేఖలో పేర్కొన్నారు.