అరకులోయ మండలంలోని యండపల్లివలస గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న జన్ని ప్రియాంక(11) అనే విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురైంది. అపస్మారక స్థితికి చేరుకోవడంతో హాస్టల్ సిబ్బంది వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే బాలిక మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్, క్లాస్ టీచర్ తీరు వల్లనే తమ కుమార్తె మృతిచెందిందని ప్రియాంక తండ్రి మోహన్ ఆరోపించారు. ఈ సందర్బంగా ఆయన తెలిపిన వివరాలిలా వున్నాయి. అరకులోయ మండలం పద్మాపురం పంచాయతీ దుమ్మగుడ గ్రామానికి చెందిన జన్ని ప్రియాంక ఎండపల్లివలసలోని గురుకుల బాలికల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నది.
బాలిక తండ్రి మోహన్.. కుమార్తెను చూసేందుకు గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో పాఠశాలకు వచ్చాడు. బాగా నీరసంగా ఉందని, కాళ్లు చేతులు పీకుతున్నాయని ఆమె చెప్పింది. దీంతో ప్రిన్సిపాల్ అనుమతితో కుమార్తెను అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాడు. మధ్యాహ్నం ఒంటిగంటకు తిరిగి పాఠశాలకు తీసుకువచ్చాడు. అయితే ప్రియాంకకు ఆరోగ్యం బాగోలేదని, ఇంటికి తీసుకెళతానని ప్రిన్సిపాల్‌ను, క్లాస్ టీచర్‌ను అడగ్గా.. వారు నిరాకరించారు. సాయంత్రం ఐదు గంటల వరకు పాఠశాల వద్దే ఉన్న అతను.. కుమార్తెను పంపక పోవడంతో ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో సాయంత్రం 6.45 గంటల సమయంలో ప్రియాంక పండ్లు తింటూ వాంతులు చేసుకుంది. కొద్దిసేపటికే అపస్మారక స్థితికి చేరుకోవడంతో హాస్టల్ సిబ్బంది వెంటనే ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాలిక మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. అయితే ప్రియాంకకు సీరియస్‌గా వుందని, ఆస్పత్రికి రావాలంటూ పాఠశాల సిబ్బంది ఏడు గంటల సమయంలో మోహన్‌కు ఫోన్‌చేసి తెలియపరిచారు. ఆయనతోపాటు కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే విగతజీవిగా మారిన బాలికను చూసి కన్నీరుమున్నీరు అయ్యారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ప్రియాంక చనిపోయిందంటూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న సీఐ హిమగిరి, ఎప్‌ఐ, సిబ్బంది వచ్చి ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేశారు. కాగా గిరిజన సంక్షేమ విద్యా శాఖ డీడీ ఎల్.రజని గురువారం రాత్రి ఆస్పత్రికి వచ్చి బాలిక మృతదేహాన్ని పరిశీలించి, తల్లిదండ్రులతో మాట్లాడారు.