విశాఖపట్నంలో మరో సరికొత్త దందా బయటపడింది. కొన్ని ముఠాలు పోలీసుల కళ్లుగప్పి గంజాయిని ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. తాజాగా నగరంలో డ్రైఫ్రూట్స్ మాటున సాగుతున్న గంజాయి అక్రమ రవాణాకు బ్రేకులు వేశారు. ప్రముఖ కొరియర్ సంస్థ ద్వారా గంజాయి రవాణా చేస్తున్న ముఠా గుట్టును విశాఖపట్నం రైల్వే పోలీసులు బయటపెట్టారు. విశాఖ నుంచి ఢిల్లీకి 16 కిలోల గంజాయిని రవాణా చేస్తుండగా వికాశ్‌కుమార్ అనే వ్యక్తి రైల్వే పోలీసులు పట్టుకున్నారు. అతడ్ని ప్రశ్నించగా కీలక విషయాలు తెలిశాయి.
వికాశ్ కుమార్ కుమార్ అతి తెలివితో గంజాయిని ఎవరికీ అనుమానం రాకుండా ప్యాక్ చేసి, ఆన్‌లైన్‌లో హోం సర్వీస్ పికప్ బుక్ చేస్తున్నాడు. కొరియర్ సంస్థలు ఒకవేళ ప్యాకింగ్‌లో ఏముందని అడిగితే.. డ్రైఫ్రూట్స్ అని చెబుతుండటంతో నిజమేనని నమ్మి వారు బుక్ చేస్తున్నారు. కొద్దిరోజులుగా గుట్టుగా ఈ వ్యవహారం నడుస్తోంది. విశాఖపట్నం నుంచి పలు ప్రాంతాలకు గంజాయి రవాణా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ గంజాయి అక్రమ రవాణా వెనుక ముఠా ఉన్నట్లు తెలుసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. వికాశ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
అలాగే రైల్వేస్టేషన్‌లో చేపట్టిన తనిఖీల్లో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళకు చెందిన మహ్మద్ నాదిర్‌షా దగ్గర 8 కిలోలు, బిహార్‌కు చెందిన నితీష్‌కుమార్ దగ్గర 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కొంతకాలంగా గంజాయిని రైళ్లలో తరలిస్తున్నారు. వీరు సాధారణ ప్రయాణికుల్లో లగేజి బ్యాగులతో యాత్రలకు కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్నట్లు నమ్మిస్తున్నారు. విశాఖపట్నం నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి తరలించేందుకు ముఠాలు రైలు మార్గాన్ని ఎంచుకోవటానికి చాలా కారణాల ఉన్నాయి.
తక్కువ ఖర్చుతో పాటుగా ఎక్కువ మందిలో నిందితులను పోలీసులు గుర్తించడం కష్టంగా ఉంటుంది. రైలు మార్గంలో అయితే తప్పించుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ ముఠాలు రైలు ఎక్కిన తర్వాత కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తాయి. ఆ బ్యాగులను వారున్న చోట కాకుండా తలుపు పక్కన, మరుగుదొడ్లు, సీట్ల కింద ఉంచుతారు, ఇంకొందరు ఒక బోగీలో ఉంచి మరో బోగీలో ప్రయాణిస్తారు. ఎప్పటికప్పుడు ఈ బ్యాగుల్ని గమనిస్తూనే ఉంటారు. పోలీసులు కూడా రైల్వే స్టేషన్‌లలో తనిఖీలను ముమ్మరం చేశారు.