వైఎస్ జగన్ ఆస్తుల కేసులపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జగన్ ఆస్తులు కేసులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని సీబీఐ, ఈడీలను ఆదేశించింది. ఈ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు రెండు వారాల్లోగా అందించాలని.. కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది. వీటితో పాటుగా తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలు అందించాలని సుప్రీం కోర్టు పేర్కొంది. అలాగే సీబీఐ, ఈడీ కేసుల వివరాలు విడివిడిగా చార్ట్ రూపంలో అందించాలని.. ఈ మేరకు అన్ని వివరాలతో అఫిడవిట్లు రెండు వారాల్లో దాఖలు చేయాలని ఆదేశించింది.
వైఎస్ జగన్ ఆస్తుల కేసులపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ ఆలస్యం అవుతోందని.. కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని గతంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఈ పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం విచారణ చేయగా.. రోజువారీ పద్ధతిలో విచారణకు ఇప్పటికే ఆదేశాలున్నాయని ఇరుపక్షాల లాయర్లు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఆదేశించినట్లు కోర్టుకు తెలిపారు
జగన్ ఆస్తుల కేసు విచారణ ఇన్నేళ్లపాటు ఎందుకు ఆలస్యమవుతోందని ప్రశ్నించింది ధర్మాసనం. డిశ్చార్జ్, వాయిదా పిటిషన్లు, ఉన్నత కోర్టుల్లో విచారణ పెండింగే కారణమని లాయర్లు కోర్టుకు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న అంశాల వల్లే ఆలస్యమని.. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలిస్తే తగిన ఆదేశాలు ఇస్తామని సుప్రీం కోర్టు ధర్మానం చెప్పింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, ట్రయల్ కోర్టు, పెండింగ్ కేసుల వివరాలు ఇవ్వాలని ఈ మేరకు సుప్రీం కోర్టు ఆదేశించింది.
గత నెలలో కూడా ఈ పిటిషన్‌పై విచారణ జరగ్గా.. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ బెంచ్‌ను మార్చిన సంగతి తెలిసిందే. రఘురామ దాఖలు చేసిన పిటిషన్ సీజేఐ ధర్మాసనం ముందుకు విచారణకు రాగా.. ఆ ధర్మాసనంలో జస్టిస్ సంజయ్‌కుమార్ నాట్ బిఫోర్ మీ అన్నారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను మరో ధర్మాసనానికి సీజేఐ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ మళ్లీ విచారణ జరగ్గా.. పూర్తి వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.