నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను... లైవ్ ఇంటర్వ్యూలు ఇస్తున్నానని ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఏపీలో తనపై నమోదైన వివిధ కేసులు, తన గురించి పోలీసులు వచ్చారనే అంశంపై ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. తనను అరెస్ట్ చేస్తే కనుక జైలుకు వెళతానని... అక్కడ ఖైదీలతో స్నేహం చేసి నాలుగు సినిమా కథలు రాసుకుంటానని తెలిపారు. తనపై నమోదైన కేసుల అంశంలో మీడియా అత్యుత్సాహం చూపిందన్నారు.పోలీసులు తనను ఇంకా పట్టుకోలేదేమిటని కొంతమంది అంటున్నారని తెలిపారు. గత కొన్నేళ్లుగా తన ఎక్స్ ఖాతాలో వేలాది పోస్టులు పెడుతున్నానని... అందులో కొన్ని పోస్టుల వల్ల నలుగురి మనోభావాలు గాయపడ్డాయని ఏడాది తర్వాత కేసులు పెట్టారని తెలిపారు. పోస్టులు పెట్టిన ఇన్నాళ్లకు నలుగురైదుగురు మేల్కొనడం ఏమిటి అని ప్రశ్నించారు.వివిధ జిల్లాల్లో తనపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. అయితే తనకు ఉన్న కమిట్‌మెంట్స్ వల్ల హాజరుకాలేనని కోర్టుకు విజ్ఞప్తి చేశానన్నారు. ఇటీవల తనను పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో వారితో పాటు కొన్ని మీడియా సంస్థలు కూడా తన డెన్‌కు వచ్చాయని... తాను అక్కడ లేకపోయేసరికి పారిపోయినట్లు మీడియా సంస్థలు కథలు అల్లాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.తన అరెస్టు గురించి ఏ పోలీసు అధికారి చెప్పనప్పటికీ... తన కోసం కేరళ, కోయంబత్తూరులలో పోలీసులు వెతుకుతున్నట్లుగా రాశారన్నారు. లేని వార్తలను కొంతమంది సృష్టిస్తుంటారని, తన విషయంలోనూ అలాగే జరిగిందన్నారు. తాను పోస్ట్ చేసిన కార్డూన్‌లో అనేక రకాల కోణాల్లో ఆపాదించుకోవచ్చన్నారు. తాను పెట్టిన కార్టూన్‌లను ప్రధాన మీడియా సంస్థలు కూడా తనను కోట్ చేస్తూ పంచుకున్న సందర్భాలు ఉన్నాయన్నారు.హైదరాబాద్‌లో ఉన్నానని చెబుతున్నప్పటికీ పరారీలో ఉన్నట్లు చెప్పడం ఏమిటన్నారు. ప్రకాశ్ రాజ్, నాగార్జున తనను దాచి పెట్టినట్లుగా కూడా ప్రచారం జరిగిందన్నారు. పోలీసుల కంటే మీడియానే డిటెక్టివ్‌గా మారిందని ఎద్దేవా చేశారు. కార్టూన్లు సహజమేనని... అమెరికా వంటి దేశం కూడా మీమ్స్‌ను ఆపలేకపోయిందన్నారు. ప్రతి మనిషికి వేర్వేరు ఆలోచనలు ఉంటాయన్నారు.