ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రముఖ స్వామీజీ విగ్రహం ధ్వంసం.. ఏసుక్రీస్తు కలలో చెప్పాడన్న నిందితుడు!

national |  Suryaa Desk  | Published : Fri, Dec 06, 2024, 08:12 PM

బెంగళూరులో సిద్ధగంగా మఠం మాజీ పీఠాధిపతి శివకుమార్‌ స్వామి విగ్రహాన్ని నవంబర్‌ 30న ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన బెంగళూరు పోలీసులు.. డెలివరీ బాయ్‌గా పనిచేస్తోన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీకృష్ణ (37) అనే వ్యక్తి విగ్రహం ధ్వంసం చేసినట్టు గుర్తించారు. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. విచారణలో అతడు చెప్పిన కారణం విని షాకయ్యారు. తనకు ఏసుక్రీస్తు కలలో కనిపించాడని, దీంతో స్ఫూర్తిగా తీసుకుని విగ్రహం ధ్వంసం చేసినట్టు వెల్లడించాడు.


నవంబరు 30 తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో బెంగళూరులోని వీరభద్ర నగర్‌లో ఉన్న శివకుమార్ స్వామి విగ్రహాన్ని శ్రీకృష్ణ ధ్వంసం చేసి.. అక్కడ నుంచి పరారయ్యాడు. మర్నాడు ఉదయం విగ్రహం ధ్వంసమైన విషయం తెలిసిన స్థానికులు.. ఆందోళనకు దిగారు. కుట్రదారుడ్ని తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగడంతో పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగారు. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించి నిందితుడ్ని డెలివరీ బాయ్ శ్రీకృష్ణగా గుర్తించారు. అతడ్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. జ్యుడీషియల్ కస్టడీ విధించింది.


అయితే, నిందితుడు చెప్పి కారణాలు నిరాధారమైనవని, ఖండించదగినవన బెంగళూరు ఆర్చ్‌ బిషప్ డాక్టర్ పీటర్ మచాడో మండిపడ్డారు. మతపరంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడొద్దని ప్రజలను కోరారు. ‘‘ మతపరమైన ఉద్రిక్తతలు, అల్లర్లు వ్యాప్తిచేయడం ఇలాంటి ప్రకటనల ఉద్దేశం... శాంతి, కరుణ, లౌకిక విలువలకు ప్రతీక అయిన శివకుమార్ స్వామి జీ వంటి గొప్ప వ్యక్తిని అగౌరవించడం ఆమోదయోగ్యం కాదు’ అని ఆర్చ్ బిషప్ అన్నారు.


నిందితుడి చర్యల వెనుక అతడి మానసిక పరిస్థితి కారణమా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడికి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు ధ్రువీకరించిన పోలీసులు.. తదుపరి ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. అయినప్పటికీ, సమగ్ర విచారణ లేకుండా కేవలం మానసిక కారణాలతో మాత్రమే చర్యను ముందస్తుగా ఆపాదించలేమని పేర్కొన్నారు. ఇక, లింగాయత్ వర్గానికి చెందిన సిద్ధగంగ పీఠాధిపతి శివకుమార్ స్వామిని ‘నడిచే దేవుడు’గా గుర్తింపు పొందారు. దాతృత్వం ముఖ్యంగా అణగారివర్గాలకు విద్యను అందించడానికి ఆయన చేసిన కృషి అమోఘం. 111 ఏళ్ల వయసులో జనవరి 2019లో శివకుమార్ స్వామి శివైక్యం చెందారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com