ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఛలో ఢిల్లీకి రైతుల పిలుపు.. సరిహద్దులను మూసివేసిన పోలీసులు

national |  Suryaa Desk  | Published : Fri, Dec 06, 2024, 08:13 PM

తమ సమస్యల పరిష్కారం కోసం మరోసారి రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. శంభు సరిహద్దులోని నిరసన స్థలం నుంచి 101 మంది రైతులతో కూడిన బృందం శుక్రవారం ఢిల్లీకి మార్చ్‌గా వెళ్తారని రైతు నేత స్వరణ్‌ సింగ్‌ పంధేర్‌ ప్రకటించారు. మధ్యాహ్నం 1 గంటకు ఈ మార్చ్ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఈ వారంలో రైతులు ర్యాలీ చేపట్టడం ఇది రెండోసారి. సోమవారం ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన రైతులు పార్లమెంట్‌ ముట్టడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. తాజాగా, మరోసారి ర్యాలీగా ఢిల్లీలోకి ప్రవేశించేందుకు సిద్ధం కావడంతో అప్రమత్తమైన పోలీసులు.. హర్యానాలోని అంబా సరిహద్దుల్లో 144 సెక్షన్ విధించారు. ర్యాలీలు, నిరసనలను నిషేధించారు.


సీనియర్‌ అధికారులతో పలు పోలీసు బృందాలను సరిహద్దు ప్రాంతాల్లో మోహరించారు. మరోవైపు, పంజాబ్‌లోని మన్సా వద్ద బఠిండా వైపుగా 50 వాహనాల్లో వస్తున్న 300 మంది రైతులను పోలీసులు అడ్డుకోవడంతో రెండు మూడు చోట్ల ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో ముగ్గురు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రతిపాదిత గ్యాస్‌ పైప్‌లైను కోసం చేపట్టిన భూసేకరణకు అందిస్తున్న పరిహారం చాలా తక్కువగా ఉందంటూ ఆ రైతులు నిరసన తెలిపారు.


పంటల మద్దతు ధరకు చట్టబద్ధత, పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా రైతులు గత నాలుగేళ్ల నుంచి నిరసన చేపడుతున్న విషయం తెలసిందే. పంజాబ్, హర్యానా, యూపీ సహా పలు రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చాగా ఏర్పడి ఆందోళనలు చేస్తున్నారు. ఇక, సోమవారం పార్లమెంట్ ఎదుట నిరసనకు బయలుదేరిన యూపీకి చెందిన రైతులను నొయిడా సరిహద్దుల్లో అడ్డుకున్నారు. అన్నదాతల ఆందోళనలతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించింది.


2012 నాటి లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనల్లో బాధితులకు న్యాయం చేయాలని, కేసులను మాఫీ చేయాలని రుణ మాఫీ, రైతులు, వ్యవసాయ కూలీలకు పెన్షన్లు, విద్యుత్ ఛార్జీలు పెంపును నిలిపివేయాలని కోరుతూ యూపీ రైతులు మార్చ్‌గా ఢిల్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13 నుంచి శంభు, ఖనౌరి సరిహద్దుల్లో రైతుల శిబిరాలు కొనసాగుతున్నాయి.


సరిహద్దులోని హర్యానా వైపు బహుళ లేయర్ బారికేడింగ్‌తో పాటు కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించారు. భద్రతా పరిస్థితిని అంచనా వేయడానికి సీనియర్ పోలీసు అధికారులు సరిహద్దుకు చేరుకున్నారు. కాగా, రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతియుతంగా నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు అయితే, రహదారులను అడ్డుకుని ప్రజలకు అసౌకర్యం కలిగించరాదని సుప్రీంకోర్టు పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com