అగ్రరాజ్యం అమెరికాను భారీ భూకంపం వణికించింది. ఉత్తర కాలిఫోర్నియాలో రిక్టర్ స్కేల్‌పై 7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఫెర్న్‌డేల్‌కు నైరుతి దిశగా 100 కిలోమీటర్ల దూరంలో కేప్ మెండోసినో తీరంలో 7.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS)తెలిపింది. భూకంపం ధాటికి కిరాణా దుకాణాల్లో సామాన్లు కిందపడిపోగా.. హడావుడిగా పాఠశాలల్లో పిల్లలను బల్లల కింద కూర్చోబెట్టారు. ఈ క్రమంలో అమెరికా పశ్చిమ తీరంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారారు. ఉత్తర కాలిఫోర్నియా తీరానికి సమీపంలో భూకంప కేంద్రం 6 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు గుర్తించారు. ఈ సమాచారాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఎక్స్ (ట్విట్టర్)లో వెల్లడించింది. భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల తీరం పొడవునా సునామీ వచ్చే అవకాశం ఉందని హోనొలులులోని సునామీ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. ఇప్పటి వరకూ రాకాసి అలలు తీరాన్ని తాకినట్టు గుర్తించలేదు కానీ తీర ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
ఫెర్న్‌డేల్ నగరానికి పశ్చిమాన స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 10.44 గంటలకు భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. హంబోల్ట్ కౌంటీలోని ఒక చిన్న నగరమైన ఫెర్న్‌డేల్... ఒరెగాన్ సరిహద్దు నుంచి 209 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే, భూకంప ప్రకంపనలు అక్కడకు 435 కిలోమీటర్ల దూరంలోని దక్షిణ శాన్ ఫ్రాన్సిస్కో వరకు వ్యాపించాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు అక్కడ ప్రజలు భావించారు. అనంతరం, అనేక చిన్న భూకంపాలు కూడా సంభవించినా.. ఇప్ప వరకు పెద్దగా ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్టు సమాచారం లేదు. భూకంప ప్రభావంతో పెట్రోలియా, స్కాటియా, కాబ్ తదితర ప్రాంతాల్లో శక్తిమంతమైన ప్రకంపనలు నమోదయ్యాయి.
భూకంపం సంభవించిన వెంటనే కాలిఫోర్నియాలోని మోంటెరీ బే నుంచి ఒరెగాన్ వరకు 500 మైళ్లు (805 కిలోమీటర్లు) తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో అక్కడ నివసిస్తోన్న 50 లక్షల మందికి పైగా ప్రజలకు సునామీ ముప్పులో పడ్డారు. భూకంపం ప్రకంపనలు చాలా బలంగా ఉన్నాయని, మా భవనం కదిలిందని స్థానికుడు ఒకరు అన్నారు. కానీ మేము బాగానే ఉన్నామని పేర్కొన్నారు. ఇక, రెడ్‌వుడ్ అడవులు, అందమైన పర్వతాలు, మూడు కౌంటీ ఎమరాల్డ్ ట్రయాంగిల్‌లోని ప్రసిద్ధ గంజాయి పంటకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో.. రెండేళ్ల కిందట కూడా 6.4 తీవ్రతతో భూకంపం చోటుచేసుకుంది. దీంతో వేలాది మంది ప్రజలు విద్యుత్, తాగునీరు సరఫరా వంటి కనీస సౌకర్యాలు నిలిచిపోయాయి.