అస్సాంలోని డిమా హసావోలో వరదల్లో చిక్కుకున్న 9 మంది కార్మికులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఓ వైపు కార్మికుల పరిస్థితి ఎలా ఉందో తెలియక రెస్క్యూ బృందాలు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు గనిలో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఈక్రమంలోనే అందరిలోనూ ఆందోళన ఎక్కువ కాగా.. తాజాగా ఓ మృతదేహాన్ని వెలికి తీశాయి బృందాలు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సోమవారం రోజు హసావ్ జిల్లాకు 3 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఓ బొగ్గు గనిలో.. 9 మంది కార్మికులు తవ్వకాలు చేపడుతున్నారు. అయితే అకస్మాత్తుగా గనిలోకి నీళ్లు వచ్చేశాయి. క్షణాల్లోనే నీటి మట్టం పెరగడంతో కార్మికులు బయటకు రాలేకపోయారు. ఇలా 9 మంది కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. విషయం గుర్తించిన అధికారులు వారిని క్షేమంగా బయటకు తీసుకు వచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఈక్రమంలోనే చిక్కుకుపోయిన తొమ్మిది మందిలో ముగ్గురు ప్రాణాలు కోల్పయినట్లు గుర్తించారు. మిగతా ఆరుగురు క్షేమంగానే ఉన్నట్లు భావిస్తున్నట్లు వెల్లడించారు.
అయితే చనిపోయిన వారి మృతదేహాలతో పాటు క్షేమంగా ఉన్న మరో 6 మంది కార్మికులను బయటకు తీసుకు వచ్చేందుకు అధికారులు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. ఈక్రమంలోనే ఓ మృతదేహాన్ని వెలికి తీశారు. ఇదే విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ తెలిపారు. విశాఖట్నంలోని తూర్పు నౌకా దళానికి చెందిన డైవర్ల సాయం కోరినట్లు కూడా వెల్లడించారు. అయితే గని లోపల నీటి మట్టం అంతకంతంకూ పెరుగుతోందని.. ప్రస్తుతం 100 అడుగుల మేర నీరు చేరినట్లు రెస్క్యూ బృందాలు వివరించినట్లు సీఎం స్పష్టం చేశారు.
గనిలో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడేందుకు గనిలోకి దిగిన కార్మికులకు వారి బట్టలు, బూట్లు వంటివి లభించాయని అధికారులు చెప్పారు. కానీ మృతదేహాలు లభ్యం కాలేదని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే కార్మికులు గనిలోని సొరంగాల్లోకి ప్రవేశించి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నావికా దళం, సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్కు చెందిన ప్రత్యేక డైవర్లు గనిలోకి ప్రవేశించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు వివరించారు. మరోవైపు అంతకంతకూ పెరుగుతూ వస్తున్న నీటిని తోడేందుకు వాటరింగ్ పైపులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఏది ఏమైనా రాత్రి, పగలు అనే తేడా లేకుండా సహాయక చర్యలు చేపట్టి మరీ బతికున్న కార్మికులను క్షేమంగా బయటకు తీసుకు వస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు. ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి మృతదేహాలను కూడా త్వరలోనే వారి కుటుంబ సభ్యులకు చేరుస్తామని చెప్పుకొస్తున్నారు.