ఆధ్యాత్మిక నగరంలో మృత్యు ఘోష వినిపించింది. గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన ప్రాంతం భక్తుల ఆర్తనాదాలతో దద్దరిల్లింది. ఆ ఏడుకొండల వాడి సన్నిధిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన పెను విషాదంగా మారింది.బైరాగిపట్టెడలో టీటీడీ ఎంజీఎం స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం ఆరుగురి పాలిట మృత్యు ప్రాంగణమైంది. వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల కోసం ఊహించని రీతిలో భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. టోకెన్ల కోసం వెళ్లి పలువురు భక్తులు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. తిరుపతిలో జరిగిన తోపులాట ఘటనలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందన్నారు.డీజీపీ, టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీతో సీఎం సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. అన్ని విషయాలపై ఆరాతీశారు. ముందుజాగ్రత్త చర్యల్లో విఫలం కావడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి సందర్భాల్లో అప్రమత్తంగా.. బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. కౌంటర్ల నిర్వహణ, భద్రతపై పునఃసమీక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు..