మధ్యప్రదేశ్ లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. భోపాల్‌లోని సెంట్రల్ జైలులో ఓ చైనా డ్రోన్ కలకలం సృష్టించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..అండా సెల్‌గా పిలిచే ఈ జైలులో భయంకరమైన గూండాలు, ఉగ్రవాదులు ఉంటారు. బుధవారం రాత్రి హైరిస్క్ సెల్ వెలుపల ఓ డ్రోన్ ఉండటాన్ని పెట్రోలింగ్ గార్డ్ గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన గార్డ్ పైఅధికారులకు సమాచారమిచ్చారు. ఆ డ్రోన్ చైనాకు చెందినదిగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతేకాక, అందులో రెండు లెన్సులు కలిగిఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది?, ఎవరికి చెందినది అనే విషయాన్ని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. భోపాల్ సెంట్రల్ జైలు దేశంలోని అత్యంత ప్రమాదకరమైన జైళ్లలో ఒకటి. ఇందులో వివిధ ఉగ్రవాద సంస్థలకు చెందిన 70 మంది ఉగ్రవాదులు హైసెక్యూరిటీ సెల్‌లో ఉన్నారు. గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం అందరినీ భయాందోళనకు గురిచేస్తుంది. ఈ ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు