గత 15 నెలలుగా ఇజ్రాయేల్, హమాస్ మధ్య యుద్ధం భీకర పోరాటం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో బందీల విడుదల విషయంలో హమాస్‌కు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేశారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టలోగా బందీలను వదలిపెట్టాలని, లేకుంటే మీ అంతుచూస్తానని హెచ్చరించారు. ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో తాజాగా ట్రంప్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అమెరికా అధ్యక్షుడిగా 2025 జనవరి 20న నేను బాధ్యతలు చేపట్టబోతున్నాను.. ఈలోపు బందీలను హమాస్ విడుదల చేయాలి.. అలా జరగని పక్షంలో ఈ దురాగతాలకు పాల్పడేవారికి నరకం చూపిస్తా... చరిత్రలో చూడని పరిణామాలు చవిచూడాల్సి ఉంటుంది.. వెంటనే బందీలను వదలిపెట్టండి’ అని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
హమాస్ చెరలో బందీలుగా ఉన్న అమెరికనల్ల విడుదలపై చర్చల గురించి మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. గతంలో ఏం జరిగింది అనే దానిపై తాను ఇప్పుడు మాట్లాడదలచుకోలేదని వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రత్యేక ‘‘ఏ విధంగానూ ప్రతికూలంగా ఉండాల్సిన అవసరం లేదు... కానీ, అధ్యక్షుడిగా స్థాయికి తగినట్టుగా వ్యవహరించాలి.. నేను బుధవారం దోహాకు వెళ్తున్నాను.. పలు అంశాలపై అక్కడ పురోగతి వస్తుందని ఆశిస్తున్నా.. ఇజ్రాయేల్-హమాస్ మద్య చర్చలకు నేను విఘాతం కలిగించాలని అనుకోవడం లేదు’ అని పేర్కొన్నారు.
కాగా, బందీల విడుదలపై చర్చలు తుది దశకు చేరుకున్నాయని మధ్య ఆసియాలో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవెన్ చార్లెస్ విట్కాఫ్ వెల్లడించారు. ‘‘చర్చలు చివరి దశకు చేరుకున్నాయి.. మేం ఈ విషయంలో గొప్ప పురోగతి సాధించాం.. డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టే నాటికి దీనిపై మేం శుభవార్త ప్రకటిస్తామని ఆశిస్తున్నాం.. బందీలను హమాస్ ఇప్పటికే విడుదల చేయాల్సి ఉంది. కానీ అలా చేయలేదు.. ఇది వారికి అంత మంచిది కాదు. అక్టోబర్ 7 నాటి దాడులు పునరావృతం కాకూడదు.. ఆ దాడుల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయేల్ నుంచి చాలామంది నాకు ఫోన్ చేసి బందీలని త్వరగా విడిపించాలని వేడుకుంటున్నారు. బందీల్లో అమెరికా పౌరులు కూడా ఉన్నారు’ అని అన్నారు.
కాగా, ఇజ్రాయేల్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు హమాస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఆ సంస్థ మిలిటరీ విభాగం అల్ కస్సామ్ బ్రిగేడ్.. తమ వద్ద బందీగా ఉన్న అమెరికన్ ఇజ్రాయేల్ పౌరుడు ఎడాన్ అలెగ్జాండర్ వీడియోను విడుదల చేసింది. ‘నేను గత 420 రోజులుగా హమాస్ చెరలో ఉన్నాను.. భయంతో మేము రోజుకు వెయ్యిసార్లు చస్తున్నాం. మమ్మల్ని త్వరగా విడిపించండి’ అని కన్నీళ్లుపెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ట్రంప్ హెచ్చరికలు చేయడం గమనార్హం.