ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సస్పెన్స్ వీడింది. టోర్నీ సందిగ్ధతకు తెరదించేలా ఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే నిర్వహించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు కూడా సమాచారం ఇచ్చిందట. అయితే ఇదే సమయంలో భారత్ ఆడే మ్యాచులు దుబాయ్ వేదికగా జరగాలని కూడా ఐసీసీ నిర్ణయించింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్థాన్ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగాల్సి ఉంది. అయితే భద్రతా పరమైన కారణాల దృష్ట్యా అక్కడకు భారత జట్టును పంపలేమని బీసీసీఐ ఇది వరకే ఐసీసీకి స్పష్టం చేసింది. తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించాలని కోరింది. కానీ ఈ ప్రతిపాదనకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంగీకరించలేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ పాక్‌లోనే టోర్నీ నిర్వహించాలని ఇదివరకూ పట్టుబట్టిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. తాజాగా మరో ప్రతిపాదన చేసింది.
భారత జట్టు పాక్‌లో పర్యటించకపోతే.. 2031 వరకు భారత్‌లో జరిగే అన్ని ఐసీసీ టోర్నీల్లోనూ తమ మ్యాచులు తటస్థ వేదికల్లోనే నిర్వహించాలని పట్టుబట్టింది. అలా అయితేనే హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకుంటామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రతిపాదనతో ఐసీసీ సమస్యకు చెక్ పెట్టింది. పాక్ అడిగిన 2031 వరకు కాకుండా.. 2027 వరకు భారత్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్లను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తామని తెలిపింది. ఈ ప్రతిపాదనకు పీసీబీ అంగీకరించినట్లు తెలుస్తోంది.
అయితే 2026 పురుషుల టీ20 ప్రపంచకప్ భారత్-శ్రీలంక దేశాల్లో జరగనుంది. ఎలాగూ శ్రీలంకలో కొన్ని మ్యాచులు జరుగుతాయి కాబట్టి.. పాక్ మ్యాచులు అక్కడే నిర్వహించాలని బీసీసీఐ డిసైడ్ అయినట్లు సమాచారం. అందుకే ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచులు యూఏఈ వేదికగా జరగనున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఐసీసీ అధికారికంగా సభ్య దేశాలతో సమావేశమై.. టోర్నీ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. అంటే మరో మూడు- నాలుగు రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది.