ఆడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచులో పోలిస్తే భారత్ 3 మార్పులతో బరిలోకి దిగింది. ఆస్ట్రేలియా తుది జట్టులో ఒక మార్పు చేసింది. గాయంతో ఆ జట్టు పేసర్ జోష్ హేజిల్‌వుడ్ దూరంకాగా.. స్కాట్ బోలాండ్‌ను జట్టులోకి తీసుకుంది.
ఇక భారత్ ఈ మ్యాచు కోసం తుది జట్టులో మూడు మార్పులు చేసింది. వ్యక్తిగత కారణాలతో రోహిత్ శర్మ, గాయంతో శుభ్‌మన్ గిల్ తొలి టెస్టుకు దూరమయ్యారు. వారిద్దరూ ఈ మ్యాచ్ ఆడుతున్నారు. దీంతో తొలి టెస్టు తుది జట్టులో ఉన్న దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్‌లు బెంచ్‌కే పరిమితమయ్యారు. ఇక వాషింగ్టన్ సుందర్ బదులు రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి వచ్చాడు.
ఆడిలైడ్‌లో ఈ మ్యాచ్ మందు వరకూ 82 టెస్టులు జరిగాయి. అందులో టాస్ గెలిచిన జట్లు 72 సార్లు బ్యాటింగ్ ఎంచుకున్నాయి. ఇక్కడ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జట్టు రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది. ఆడిలైడ్‌లో ఏడు డే నైట్ టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా అన్నింట్లోనూ విజయం సాధించింది. ఈ మ్యాచులో భారత ఇన్నింగ్స్‌ను యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్ ఆరంభించనున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ తన ఓపెనింగ్ స్థానాన్ని రాహుల్‌కి ఇచ్చేశాడు. కాగా ఇదివరకే తొలి టెస్టులో గెలిచిన భారత్ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచులోనూ గెలిచి ఐదు మ్యాచుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని పట్టుదలతో ఉంది.
పింక్ బాల్ టెస్టులో రికార్డు..
ఆస్ట్రేలియా ఇదివరకు 12 పింక్ బాల్ టెస్టులు ఆడింది. అందులో 11 సార్లు విజయం సాధించింది. వెస్టిండీస్‌తో ఒకే మ్యాచులో ఓడిపోయింది. ఇక నాలుగు డే నైట్ టెస్టులు ఆడిన భారత్.. మూడింట్లో విజయం సాధించింది.
తుది జట్లు..
భారత్:
యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, రోహిత్ శర్మ (కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా:
ఉస్మాన్ ఖావాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లైయాన్, స్కాట్ బోలాండ్