డీప్ టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత చేరువకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.. డీప్ టెక్నాలజీ పై ఈరోజు సదస్సులో చర్చించామని అన్నారు. సాంకేతికతను వినియోగించుకుని ఏపీని మరింత అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. ఇవాళ(శుక్రవారం) విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సాంకేతికతను వినియోగించుకుని పరిపాలనకు మరింత సౌలభ్యం ఉంటుందని సూచించారు.. ఈచ్ వన్ ఎంటర్ ప్రెన్యూర్ వన్ అనే నినాదం ముందుకు వెళ్తున్నామని వివరించారు.ఫోర్ పీసీ విధానంతో పాటుగా 4 ఈ విధానం కూడా అమలు చేస్తామన్నారు. అభివృద్ధికి టెక్నాలజీని జోడిస్తే, మంచి ఫలితాలు వస్తాయని ఉద్ఘాటించారు. విశాఖ అభివృద్ధి మీద విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తామని.. అన్ని విధాల విశాఖ అభివృద్ధి చేస్తామని తెలిపారు. విశాఖపట్నం మెట్రోకు డీపీఆర్ తయారు చేసి పంపించామని చెప్పారు. రైల్వే జోన్ వస్తోంది. జోన్ భవనాల నిర్మాణ అంశాలు ప్రక్రియ ప్రారంభం అవుతుందని అన్నారు. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. విశాఖకు కూడా సీ ప్లైన్ అనుకూలతను పరిశీలిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.