సాక్షి మీడియా ఫేక్ న్యూ'స్ ను ప్రచురిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి పేపర్లో ప్రచురించిన తప్పుడు కథనాలపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పై తప్పుడు కథనాన్ని ప్రచురించిందని అన్నారు. వారం తిరగక ముందే స్మార్ట్ మీటర్లపై మరో తప్పుడు కథనాన్ని రాసిందని మండిపడ్డారు. సాక్షి రాసిన అబద్ధపు కథనాలను ఖండిస్తున్నానని అన్నారు. ఫేక్ న్యూస్ ను ప్రచురిస్తే రాసిన వారిని చూసి అక్షరాలు సిగ్గుపడుతాయని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విమర్శలు చేశారు.కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుంటే నీలి మీడియా చూసి ఓర్వలేకపోతుందని ఆక్షేపించారు. ప్రజాక్షేత్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక.. సాక్షిలో తప్పుడు రాతలు రాయిస్తున్నారని మండిపడ్డారు. సాక్షి రాయాలనుకుంటే జగన్ హయాంలో కూల్చేసిన అన్న క్యాంటీన్లు, ప్రజావేదిక, పార్టీ ఆఫీసులపై చేసిన దాడుల గురించి రాయాలని చెప్పారు. ప్రజలకు మంచి చేసే అన్న క్యాంటీన్లు, మెగా డీఎస్సీ, గుంతల రోడ్ల పూడ్చివేత, ఎక్కడా లేని విధంగా ఎక్కువ మందికి పింఛన్ల పంపిణీ గురించి రాయాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.