పల్నాడులో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామం వద్ద వేగంగా వస్తోన్న కారు.. చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని వారికి తీవ్రగాయాలు కాగా.. నలుగురు అక్కడికక్కడనే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. మృతులను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావాలి సమీపంలోని సిరిపురం వాసులుగా గుర్తించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం పిడుగురాళ్ల ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం
అయితే, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. బాధితుల కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.
నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని సిరిపురం గ్రామానికి చెందిన తుళ్లూరు సురేశ్, వెంకటేశ్వర్లు, వనిత, యోగులు తమ కుటుంబసభ్యులతో కలిసి తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. కారును కొనుగోలు చేసిన ఈ కుటుంబం.. పూజలు చేయించేందుకు కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. తిరుగు ప్రయాణంలో అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు కారణంగా వారి కారు చెట్టును ఢీకొట్టడంతో విషాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాల తెలియాల్సి ఉంది.