కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి కడప సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. షర్మిల, విజయమ్మ, సునీతలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన కేసులో వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. విచారణలో రాఘవరెడ్డి పేరును వర్రా రవీంద్రారెడ్డి చెప్పారు. తాను సొంతంగా పోస్టులు పెట్టలేదని, అవినాశ్ రెడ్డి ఆఫీస్ నుంచే కంటెంట్ అంతా వచ్చిందని పోలీసులకు వర్రా తెలిపారు. అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇచ్చిన కంటెంట్ ను తాను పోస్ట్ చేశానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాఘవరెడ్డిపై నెల రోజుల క్రితమే కేసు నమోదయింది. రాఘవరెడ్డి కోసం పోలీసులు నెల రోజులుగా గాలిస్తున్నారు. అయితే ఈనెల 12వ తేదీ వరకు అరెస్ట్ చేయకుండా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న రాఘవరెడ్డి పులివెందులకు వచ్చారు. ఆయన పులివెందులకు వచ్చిన వెంటనే పోలీసులు నోటీసులు ఇచ్చారు. కేవలం విచారణ మాత్రమే చేస్తామని, అరెస్ట్ చేయబోమని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. కడప సైబర్ క్రైమ్ అఫీసుకు రావాలని తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన పోలీసు విచారణకు వచ్చారు.