ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ ఇవాళ ఆయన కార్యాలయానికి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. అంతేకాదు, పవన్ ను ఉద్దేశించి అభ్యంతరకర రీతిలో ఆ వ్యక్తి సందేశం కూడా పంపినట్టు తెలిసింది. ఈ బెదిరింపు కాల్స్ వ్యవహారాన్ని డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది పవన్ కల్యాణ్, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పవన్ కార్యాలయానికి బెదిరింపు కాల్స్ రావడం పట్ల హోంమంత్రి అనిత స్పందించారు. ఈ వ్యవహారంపై ఆరా తీశారు. వెంటనే పోలీసు ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. వారితో మాట్లాడిన అనిత, వెంటనే నిందితులను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. హోంమంత్రి ఆదేశాల నేపథ్యంలో, పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పవన్ కార్యాలయానికి బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని కృష్ణలంక పోలీసులు గుర్తించారు. విజయవాడ లబ్బీపేట వాటర్ ట్యాంక్ రోడ్ లో ఉంటున్న మల్లికార్జున్ ఈ కాల్ చేసినట్టు నిర్ధారించారు. దాంతో, మల్లికార్జున్ ఫోన్ ట్రాక్ చేసేందుకు ప్రయత్నించగా... మల్లికార్జున్ ఫోన్ స్విచాఫ్ చేశాడు.