కాకినాడ సెజ్ కు భూములు ఇచ్చేందుకు నిరాకకరించిన తమ జీవితాలతో సీఎం చంద్రబాబు చెలగాటం ఆడారని పలువురు బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు కేసులు, జైలు జీవితం, నిత్యం నిర్భందాల మధ్య తమ కుటుంబాలను అనుక్షణం వేదనకు గురి చేశాడని మండిపడ్డారు. పచ్చని పొలాలతో ఉన్న తమ ప్రాంతంలో పరిశ్రమల పేరుతో భూసేకరణను ప్రారంభించిన చంద్రబాబు ఆ తరువాత ఇక్కడి రైతులపై ప్రదర్శించిన దౌర్జన్యాలు, దాష్టీకంను గుర్తు చేసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష నేతగా సెజ్ బాధిత రైతులకు అండగా ఉంటానంటూ మోసపూరితమైన మాటలు చెప్పి, అధికారంలోకి వచ్చిన తరువాత సీఎంగా తన నిజ స్వరూపాన్ని చూపించిన చంద్రబాబు నైజంను రైతులు మీడియా ముఖంగా ఎండగట్టారు. కాకినాడలోని క్యాంప్ కార్యాలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ ఎంపి వంగా గీతలతో కలిసి రైతులు మీడియాతో మాట్లాడారు.