రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ళను సర్వనాశనం చేస్తూ సీఎం చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నారని మాజీ మంత్రి, వైయస్సార్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మెరుగు నాగార్జున మండిపడ్డారు. పేద విద్యార్ధుల జీవితాల్లో వెలుగు రావాలని గత ప్రభుత్వంలో సీఎం శ్రీ వైయస్ జగన్ అమలు చేసిన పలు కార్యక్రమాలను నిలిపివేస్తూ, పేద విద్యార్ధుల జీవితాల్లో చంద్రబాబు విషం చిమ్మతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని భ్రష్టు పట్టిస్తూ, తనకు అనుకూలమైన ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహించేందుకు చంద్రబాబు దుర్మార్గమైన విధానాలను అమలు చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మెరుగు నాగార్జున ఆక్షేపించారు. విద్యార్థులకు వేల కోట్ల ఫీజు బకాయి పడిన కూటమి ప్రభుత్వం, ఈరోజు విద్యార్దుల తల్లిదండ్రులతో మెగా మీట్ అంటూ కొత్త నాటకానికి తెర తీసిందని మెరుగు నాగార్జున స్పష్టం చేశారు.