మార్ఫింగులు, ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ టీడీపీయే, ఆ పార్టీ అధికారిక ఖాతా నుంచే అసభ్యకర పోస్టింగ్స్ వస్తున్నాయని వైయస్ఆర్‌సీపీ లీగల్‌సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి వెల్లడించారు. `వైఫల్యాలు ప్రశ్నించడం నేరం’ అన్నట్లుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఆ దిశలోనే కేసులు నమోదు చేయడంతో పాటు, అక్రమ అరెస్టులు చేస్తూ, వేధింపుల పర్వం కొనసాగిస్తోందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని, తప్పు చేయని వారిని దోషులుగా చిత్రీకరిస్తూ.. తప్పు చేసిన వారిని దొరలుగా.. తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేస్తోందని ఆయన ఆక్షేపించారు. అధికార పార్టీ చేసే తప్పులను ఒప్పులుగానూ.. ప్రతిపక్షాలు చేసే మంచిని కూడా చెడుగా ఎల్లో మీడియా చిత్రీకరించి ప్రజలను వంచన చేస్తోందని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మనోహర్‌రెడ్డి చెప్పారు.