ఈ ప్రపంచంలో దేవుడు తర్వాత అందరూ చేతులెత్తి మొక్కేది డాక్టర్లకు మాత్రమే. ఆపత్కాలంలో ఊపిరి నిలిపే వైద్యులంటే దేవుడితో సమానం. అందుకే వారిని ప్రాణదాతలుగా భావించి చేతులెత్తి మొక్కుతుంటాం. కానీ కొంతమంది చేసే నిర్వాకాలతో పవిత్రమైన వైద్య వృత్తికి కూడా కళంకం అంటుతోంది. లాభాపేక్షతో కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు వ్యవహరించే తీరు కూడా విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి ఘటనే విశాఖపట్నం నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తలకు గాయమైన ఓ మహిళ సోమవారం రాత్రి నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చింది. తలకు గాయంతో ఆస్పత్రికి వచ్చిన ఆమెను పరీక్షించిన వైద్యులు.. స్కానింగ్ చేయించాలని సూచించారు.
దీంతో అదే ప్రైవేట్ ఆస్పత్రిలో ఉన్న స్కానింగ్ సెంటర్‌కు స్కానింగ్ కోసమని బాధితురాలు వెళ్లింది. అయితే స్కానింగ్ కోసం వచ్చిన మహిళ పట్ల స్కానింగ్ సెంటర్ ఇంఛార్జి ప్రకాష్ అసభ్యంగా ప్రవర్తించారు. తలకు గాయమై ఆస్పత్రికి వస్తే.. స్కానింగ్ కోసం దుస్తులు తీసేయాలంటూ మహిళకు చెప్పారు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అతగాడి ప్రవర్తనతో షాక్ తిన్న బాధితురాలు వెంటనే గట్టిగా కేకలు వేసింది. దీంతో ఆస్పత్రిలోని ఇతర రోగులు స్కానింగ్ సెంటర్ వద్దకు పరుగులు తీశారు. దీంతో తనపట్ల స్కానింగ్ సెంటర్ ఇంఛార్జి వ్యవహరించిన తీరు గురించి బాధితురాలు వారితో వాపోయింది. దీంతో ఆస్పత్రికి వచ్చిన వారితో పాటు స్థానికులు స్కానింగ్ సెంటర్ ఇంఛార్జిని చితకబాదారు.
అనంతరం పోలీసులకు ఈ సమాచారాన్ని చేరవేశారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రి వద్దకు చేరుకున్న విశాఖపట్నం త్రీటౌన్ సీఐ రమణయ్య నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో అతనిపై కేసు నమోదు చేశారు. మంగళవారం కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. ఇదే సమయంలో ప్రైవేట్ ఆస్పత్రి తీరుపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోగుల విషయంలో ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. తాజా ఘటనతో ఆస్పత్రి తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా వైద్యం కోసం వస్తే ఇలా చేస్తారా అంటూ స్థానికులు మండిపడుతున్నారు. మహిళ పట్ల అసభ్యంగా వ్యవహరించిన స్కానింగ్ సెంటర్ ఇంఛార్జిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.