విశాఖపట్నంలో దారుణం జరిగింది.. పెళ్లైన 40 రోజులకే యువకుడు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. వాట్సాప్‌లో ఘోరమైన ఫోటోను చూసి కలతచెందిన యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. మహారాణిపేట అంగటిదిబ్బ ప్రాంతానికి చెందిన నరేంద్రకు అక్టోబర్ 20న వివాహం జరిగింది. అయితే నరేంద్ర ఓ లోన్‌యాప్ నుంచి డబ్బుల్ని తీసుకోగా.. రూ.2వేల విషయంలో ఆ లోన్ యాప్ గ్యాంగ్ నరేంద్ర ఫోటోను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి బెదిరింపులకు దిగారు. అక్కడితో ఆగకుండా ఆ ఫోటోను స్నేహితులు, బంధువులకు లోన్ యాప్ నిర్వాహకులు పంపారు.
తన మార్ఫింగ్ ఫోటోను వాట్సాప్ చూడటం.. స్నేహితులు , బంధువులకు పంపించడంతో నరేంద్ర తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహమైన 40 రోజులకే యువకుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. నరేంద్ర మరణానికి కారణమైన లోన్‌యాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయి. ఇటీవల కాలంలో మళ్లీ వేధింపులు మొదలుపెట్టాయి.. తీసుకున్న రుణం చెల్లించినా సరే వెంటపడుతున్నారు. ఇంకా డబ్బులు చెల్లించాల్సిందేనంటూ టార్చర్ చేస్తున్నారు. ఆ వేధింపులు భరించలేక కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ లోన్‌యాప్ గ్యాంగ్‌లు వేధింపులతో ఆగడం లేదు.. ఫోటోలను అసభ్యకరంగ మార్ఫింగ్ చేసి బెదిరింపులుకు దిగుతున్నారు. ఆ ఫోటోను బంధువులు, స్నేహితులకు పంపిస్తున్నారు. దీంతో ఎంతోమంది ప్రాణాలు తీసుకున్నారు.
అంతేకాదు లోన్‌యాప్‌ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. లోన్ యాప్‌లకు సంబంధించిన మెసేజ్‌లు, లింక్‌లను క్లిక్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. లోన్‌యాప్‌ల ద్వారా డబ్బులు తీసుకున్న తర్వాత.. ఆ యాప్ ద్వారా మొబైల్స్‌లోని ఫోన్ నంబర్లతో పాటుగా అడ్రస్, మిగిలిన డేటాను సేకరించి ఇలా వేధింపులకు పాల్పడుతున్నట్లు తేలింది. అందుకే యాప్‌ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని.. అలాగే కాంటాక్ట్, అడ్రస్, లొకేషన్ల పర్మిషన్లు ఇవ్వొద్దని చెబుతున్నారు. లోన్‌యాప్‌ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని.. 1930 నంబర్‌కు ఫోన్ చేసి బాధితులు ఫిర్యాదు చేయొచ్చని సూచిస్తున్నారు.