ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నారా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వాస్తవానికి జనసేనలో నాగబాబు ఎన్నికల ముందునుంచి కీలకంగా పనిచేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో సోదరుడి ప్రచార బాధ్యతలను ఆయన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాగబాబుకు మంచి పదవి లభిస్తుందని ప్రచారం జరిగింది. తొలుత టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరగ్గా.. టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడిని నియమించారు. ఆ తర్వాత ఏపీ నుంచి మూడు రాజ్యసభ సభ్యుల స్థానాలు ఖాళీ అవ్వడంతో తప్పనిసరిగా నాగబాబుకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పిస్తారని చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో నాగబాబు రాజ్యసభ సభ్యత్వంపై స్పష్టత వచ్చిందని, బీజేపీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. తీరా చూస్తే మూడు రాజ్యసభ స్థానాల్లో టీడీపీకి రెండు, బీజేపీకి ఒకటి వెళ్లాయి. దీంతో నాగబాబుకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కలేదు. తాజాగా నాగబాబును ఎమ్మెల్సీ చేసి ఏపీ మంత్రి వర్గంలోకి తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. త్వరలోనే నాగబాబు జనసేన నుంచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆయనకు కేబినెట్‌లో బెర్త్ కన్ఫర్మ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.