భారతీయ ఆహారంలో ముఖ్యమైనది తెల్ల అన్నం. మన దేశంలో 90 శాతం మంది ఎక్కువగా తినేది తెల్ల అన్నాన్నే. మన భోజనంలో ప్రధాన పదార్థమైన అన్నాన్ని తినకుండా ఉండలేని వారి సంఖ్య ఎక్కువే. అన్నం అలవాటు అయిన వారికి ఇంకే పదార్థాలు తిన్నా కూడా పొట్ట నిండినట్టు అనిపించదు. అయితే ఏదీ ఎక్కువ మోతాదులో తినడం మంచిది కాదు. కాబట్టి రోజూ తినే అన్నం విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. అన్నం అదికంగా తినే వారిలో కూడా కొన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
బియ్యం గ్లైసెమిక్ ఇండెక్స్
షుగర్ పేషెంట్ల డైట్ లో అన్నం చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. వీరు అన్నానికి దూరంగా ఉండాలని కూడా వైద్యులు సలహా ఇస్తారు. ఎందుకంటే బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల బియ్యం తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయి చాలా వేగంగా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, షుగర్ పేషెంట్లు మాత్రమే కాదు, ఇతరులు కూడా ఎక్కువగా బియ్యంతో వండిన ఆహారాన్ని తినకుండా ఉంటే మంచిది.
అధిక బరువు వస్తుంది
రోజూ తినే వైట్ రైస్ లో కార్బోహైడ్రేట్ల పరిమాణం చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు రోజూ మూడు పూటలా లేదా రెండు పూటలా అన్నం ఎక్కువగా తింటే శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. దీని వల్ల ఊబకాయం బారిన త్వరగా పడతారు. అంతేకాకుండా అన్నం తిన్న కొద్దిసేపటికే ఆకలిగా అనిపించడం మొదలవుతుంది. దీని వల్ల అతిగా తినే సమస్య కూడా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు మీ బరువును అదుపులో ఉంచుకోవాలనుకుంటే అన్నాన్ని తగ్గించి చపాతీలు వంటివి తింటూ ఉండాలి.
గుండె ఆరోగ్యానికి
రోజూ అన్నం తినడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా ప్రమాదమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వాస్తవానికి, తెల్ల బియ్యంలో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ట్రైగ్లిజరైడ్ స్థాయిలు, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఇవన్నీ గుండె సంబంధిత సమస్యలు వచ్చేలా చేస్తాయి. మీరు తెల్ల అన్నానికి బదులు బ్రౌన్ రైస్ లేదా రెడ్ రైస్ వంటివి తింటే మంచిది.
మెటబాలిక్ సిండ్రోమ్
రోజూ అన్నం తినడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది క్రమంగా జీవక్రియను నెమ్మదించేలా చేస్తుంది. దీని వల్ల ఊబకాయం, జీర్ణ సమస్యలు వంటివి వస్తాయి. ప్రతిరోజూ అన్నం తినడానికి బదులుగా బ్రౌన్ రైస్ తినేందుకు ప్రయత్నించండి.
కొలెస్ట్రాల్ పెరుగుదల
అన్నం తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని ఏ అధ్యయనం ధృవీకరించలేదు. కానీ ప్రతిరోజూ బియ్యం తినడం వల్ల శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. దీని వల్ల శరీరంలో ట్రైగ్లిజరైడ్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. మీకు ఇప్పటికే అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉంటే, మీరు అన్నం తినడానికి బదులు ఇతర ఆహారాలను తినడం ఉత్తమం.