ఆస్ట్రేలియా మహిళల జట్టు చేతుల్లో భారత మహిళలు దారుణమైన ఓటమిని చవిచూసారు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 0-3 తేడాతో సిరీస్ ఓటమి చవిచూసింది. స్మృతి మంధాన తొమ్మిదో వన్డే సెంచరీ చేసినా కూడా భారత్ కు విజయం దక్కలేదు. డిసెంబర్ 11, బుధవారం, పెర్త్‌లోని WACAలో జరిగిన మూడవ, చివరి మ్యాచ్ లో హర్మన్‌ప్రీత్ కౌర్ అండ్ కో 83 పరుగుల తేడాతో ఓడిపోయారు. అనాబెల్ సదర్లాండ్ ఆల్ రౌండ్ షో ప్రదర్శించి అద్భుతమైన విజయాన్ని అందించింది.
ఆసీస్ మొదటి బ్యాటింగ్ చేసి ఆరు వికెట్లకు 298 పరుగులు చేయగా.. భారతజట్టు 215 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. భారత్ పరుగుల వేటలో ఆరంభంలోనే రిచా ఘోష్ వికెట్ కోల్పోయింది. అయితే స్మృతి మంధాన, హర్లీన్ డియోల్ రెండో వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యంతో కొంత ఊపు తెప్పించారు. హర్లీన్ 39 పరుగులు చేసి అవుట్ అయ్యాక మందానకు మరో ఎండ్ లో నుండి ఎలాంటి మద్దతు లభించలేదు. మంధాన 103 బంతుల్లో తొమ్మిదో వన్డే సెంచరీ సాధించింది, 36వ ఓవర్‌లో గార్డనర్ ఆమెను అవుట్ చేయడంతో భారత ఇన్నింగ్స్ పూర్తిగా కుప్పకూలింది. ఆస్ట్రేలియా భారతజట్టును 45.1 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ చేసింది.