ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చలికాలంలో ఇవి తింటే బాడీలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది.. కీళ్ల నొప్పులు తట్టుకోలేరు..

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Dec 11, 2024, 10:05 PM

అసలే చలికాలం.. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చలికాలంలో కొన్ని రోగాల బారిన పడే ప్రమాదముంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్‌లో మీ సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదముంది. ఇక, ఈ చల్లటి వాతావరణంలో యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే వారి సమస్యలు తీవ్రమవుతాయి.


ఈ రోజుల్లో అధిక యూరిక్ యాసిడ్ ప్రధాన సమస్యగా మారింది. రోజూ తీసుకునే ఫుడ్, డ్రింక్స్‌లో ఉండే ప్యూరిన్స్ అనే రసాయనాల్ని శరీరం విచ్ఛిన్నం చేసినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఈ వ్యాధి ప్రధాన లక్షణాల్లో కీళ్ల నొప్పులు ముందు వరుసలో ఉంటుంది. యూరిక్ యాసిడ్ స్థాయి 7.0 mg/dl కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అది కీళ్లలో స్పటికాల రూపంలో పేరుకుపోతుంది. దీంతో కీళ్లల్లో నొప్పి, వాపు కలుగుతుంది. ఈ సమస్య ఉన్నవారు ఆహారం పట్ట చాలా జాగ్రత్తగా ఉండాలి. చలికాలంలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఆ లిస్ట్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.


మద్యం..


​ఆల్కహాల్, ముఖ్యంగా బీర్ అధిక సాంద్రత కలిగి ఉంటాయి. ఇవి తాగితే యూరిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా పెరుగుతాయి. ఆల్కహాల్ శరీరం నుంచి యూరిక్ యాసిడ్ యొక్క తొలగింపును నిరోధిస్తుంది. అంతేకాకుండా శరీరంలో దాని స్థాయిలను పెంచుతుంది. ఆల్కహాల్ తాగడం వల్ల కాలేయం డ్యామేజ్ అయ్యే ప్రమాదముంది. అంతేకాకుండా ఆల్క‌హాల్ ఎక్కువ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ స్పటికాల రూపంలో కీళ్లలో పేరుకుపోయే ప్రమాదముంది. దీంతో.. కీళ్ల నొప్పుల సమస్య వస్తుంది.


ఫ్రక్టోజ్ డ్రింక్స్..


సోడా, జ్యూస్, స్పోర్ట్స్ డ్రింక్స్ మొదలైన ఫ్రక్టోజ్ డ్రింక్స్ యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఫ్రక్టోజ్ అనేది అనేక పండ్లలో కనిపించే ఒక రకమైన చక్కెర. కానీ ప్రాసెస్ చేసిన ఆహారాలు, పానీయాలకు దీనిని జోడించినప్పుడు, అది యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. అందుకే సోడాలు, కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూసులు ఎక్కువగా తాగకూడదు.


రెట్ మీట్..


​యూరిక్ సమస్య ఉన్నవారు రెట్ మీట్ ఎక్కువగా తినకూడదు. ముఖ్యంగా ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే చాలా మంది లివర్, బోటి తింటుంటారు. వీటిని కూడా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటని తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ బాగా పెరిగే అవకాశం ఉంది.


ఎనర్జీ డ్రింక్స్.. 


ఈ ఎనర్జీ డ్రింక్స్ అధిక మొత్తంలో చక్కెర, కృత్రిమ స్వీటెనర్లను కలిగి ఉంటాయి. వీటిని తాగడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో.. కీళ్ల నొప్పుల సమస్య, కిడ్నీలో రాళ్ల సమస్యలు పెరుగుతాయి. ఈ డ్రింక్స్‌తో పాటు ప్యూరిన్ అధికంగా ఉండే కొన్ని ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. తేనె, స్వీట్స్, రెట్ మీట్, పప్పులు వంటివి రాత్రి పూట తినకూడదు.


వీటిని కూడా తినకూడదు..


ఎన్ హెచ్ ఐ నివేదిక ప్రకారం, ఆస్పరాగస్ పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగులలో ప్యూరిన్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. యూరిక్‌ యాసిడ్‌ సమస్యతో బాధపడేవారు.. ప్యూరిన్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే.. పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. అందుకే వీటిని ఎక్కువగా తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


యూరిక్ యాసిడ్ తగ్గాలంటే..


* యూరిక్ యాసిడ్ తగ్గడం కోసం పుష్కలంగా నీరు తాగాలి. నీరు తాగడం వల్ల మూత్రపిండాలు శరీరం నుంచి యూరిక్ యాసిడ్‌ను తొలగిస్తాయి.


* యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచడంలో ఊబకాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.


* శరీరం నుంచి యూరిక్ యాసిడ్ తొలగించడంలో వ్యాయామం సహాయపడుతుంది.


*శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువై.. కీళ్ల నొప్పులు వస్తే వైద్యుణ్ని సంప్రదించండి.


గమనిక..ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com