సాగునీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో రెండో రోజు కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైయస్ఆర్‌సీపీ నేతలు తాము ఎన్నికలను బహిష్కరించామని చెప్పినా అరెస్ట్‌ల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. శనివారం తెల్లవారుజామునే అవినాష్ రెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.వైయస్ఆర్ జిల్లాలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద టీడీపీ శ్రేణులు మోహరించాయి.
ఎక్కడికక్కడ వీఆర్వోల నుంచి వైయస్ఆర్‌సీపీ మద్దతుదారులైన రైతులకు నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఒత్తిడి తెచ్చారు. చక్రాయపేట, వేముల, వేంపల్లెల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. వేంపల్లెలో నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సిద్దమైన వీఆర్వోలను మండల టీడీపీ నాయకుడి కుమారుడు బూతు పురాణం అందుకున్నారు.జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియంలో వీఆర్వోలందరినీ ప్రత్యేక వాహనంలో ఎక్కించుకుని టీడీపీ నేతలు సమయం ముగిసేంతవరకు తమ ఆధీనంలో పెట్టుకున్నారు. అలా చేయడంపై ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు.