ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జుట్టు బలం కోసం తినాల్సిన ఏడు బయోటిన్ సూపర్ ఫుడ్స్.. వీటిని తింటే హెయిర్ ఫాల్ ఆగిపోతుంది

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Dec 16, 2024, 10:59 PM

నేటి కాలంలో బిజీ లైఫ్‌స్టైల్, దుమ్ము, పొల్యూషన్ కారణంగా మన జుట్టు పొడిగా, నిర్జీవంగా మారుతుంది. అంతేకాకుండా.. తెల్ల జుట్టు, తలపై వెంట్రుకలు రాలిపోవడం (Hair Fall) వంటి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిన్న వయసులోనే చాలా మంది జుట్టు సమస్యలతో సతమతమవుతున్నారు. చలికాలంలో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. జుట్టు రాలడం అందరిలోనూ ఉంటుంది. అయితే, జుట్టు రాలడం ఎక్కువగా ఉంటే మాత్రం కచ్చితంగా ఆందోళన చెందాలి. ఇలాంటి సమయాల్లో ఖరీదైన షాంపూలు, కండిషనర్లు సీరమ్‌లు వాడుతుంటాం. మనం జుట్టు రాలిపోకుండా ఉండటం కోసం చాలా ఖర్చు చేస్తూంటాం.


అయితే, మనం తీసుకునే చికిత్సలు చాలా కాలం తర్వాత జుట్టును పాడు చేస్తాయి. అంతేకాకుండా మీ జేబుకు చిల్లులు పడేలా చేస్తుంది. జుట్టు రాలిపోవడానికి మనం తీసుకునే ఆహారం కూడా ఒక ప్రధాన కారణం. అందుకే ఆహారంపై తగిన శ్రద్ధ అవసరం. మన ఆహారంలో బయోటిన్ (విటమిన్ B7) ఫుడ్స్‌ని భాగం చేసుకోవాలి. బయోటిన్ ఫుడ్స్ జుట్టుకు తగిన పోషణ అందిస్తాయి. ఈ ఆహారాలు జుట్టును బలపరుస్తాయి. జుట్టు రాలడం, చిట్లిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. బయోటిన్ పుష్కలంగా ఉండే అలాంటి 7 సూపర్ ఫుడ్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.


గుడ్లు..


​గుడ్లు సంపూర్ణ పోషకాహారం. గుడ్డు బయోటిన్ అద్భుతమైన మూలంగా పరిగణిస్తారు నిపణులు. ముఖ్యంగా గుడ్డు పచ్చసొనలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. దీనితో పాటు గుడ్లలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాదు.. జుట్టు పోషణకు కూడా సహకరిస్తాయి. గుడ్డు తినడం వల్ల మూలాల నుంచి జుట్టు స్ట్రాంగ్‌గా మారుతుంది. జుట్టు రాలిపోవడం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. గుడ్డు తినడం వల్ల జుట్టు బలంగా మారుతుంది.


అవకాడో..


దీనిని వెన్నపండు అని పిలుస్తారు. ఇందులో కూడా బయోటిన్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. అంతేకాకుండా అవకాడోలో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, విటమిన్ ఈ వంటి పోషకాల ఎన్నో ఉంటాయి. ఇవి జుట్టు, చర్మ ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవకాడోను రోజూ తీసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా, దృఢంగా మారుతుంది.


బాదం పప్పు..


​బాదం పప్పులో పోషకాలు మెండుగా ఉన్నాయి. బాదంలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్ ఇ, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఉన్నాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా బాదం పప్పులో అధిక మోతాదులో బయోటిన్ ఉంది. ఇవి జుట్టుకు తగిన పోషణ ఇస్తాయి. దీంతో జుట్టు బలంగా మారుతుంది. బాదం పప్పు రోజూ తినడం వల్ల జుట్టు రాలడం తగ్గిపోతుంది. బాదం పప్పులు చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.


మెంతులు..


​మెంతుల్లో బయోటిన్, ఐరన్ రెండూ ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలకు సాయపడతాయి. మెంతులని వంటల్లో చేర్చుకోవచ్చు. లేదంటే మెంతుల పేస్టుని జుట్టుకు హెయిర్ మాస్క్‌లా వాడుకోవచ్చు. మెంతుల్ని రోజూ వాడటం వల్ల జుట్టు ఆరోగ్యం మెరగవుతుంది. అంతేకాకుండా జుట్టు మూలాలు బలపడతాయి. దీంతో.. జుట్టు రాలిపోవడం తగ్గిపోతుంది.


ఆకుకూరలు..


బచ్చలి కూర, కాలే, బ్రకోలి వంటి ఆకుపచ్చని కూరల్లో బయోటిన్, ఐరన్, ఇతర విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు మేలు చేస్తాయి. వీటిని రోజూ తినడం వల్ల జుట్టు మెరిసిపోతుంది. అంతేకాకుండా జుట్టు మూలాల నుంచి బలపడుతుంది. దీంతో.. జుట్టు రాలిపోవడం తగ్గిపోతుంది.


తృణధాన్యాలు..


ఓట్స్, బ్రౌన్ రైస్, క్వినోవా వంటి తృణధాన్యాల్లో బయోటిన్ అధిక మోతాదులో ఉంటుంది. అంతేకాకుండా వీటిలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్ కూడా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల జుట్టు మూలాల నుంచి బలంగా మారుతుంది. జుట్టు బలంగా మారడంతో పాటు రాలిపోవడం తగ్గుతుంది. చలికాలంలో జుట్టు సమస్యలకు తృణధాన్యాలు మంచి పరిష్కారం.


గుమ్మడి గింజలు..


గుమ్మడి గింజల్లో ఫైబర్, విటమిన్‌ ఏ, బీ, సీ ఈ తో పాటు ఐరన్‌, కాల్షియం, జింక్‌, ఫోలేట్‌ , ఫ్యాటీ యాసిడ్స్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం, జింక్, అమైనో యాసిడ్స్‌ ఫినోలిక్‌ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజలలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. అధిక మోతాదులో బయోటిన్ కూడా ఉంది. ఇవి జుట్టు పెరుగుదలకు, బలానికి ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల జుట్టు రాలడం సమస్య నుంచి తప్పించుకోవచ్చు. అంతేకాకుండా డాండ్రఫ్, తలలో దురద వంటి సమస్యలు కూడా నయమవుతాయని నిపుణులు చెబుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com