వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన భార్యను లోబరుచుకుని విశాఖపట్నంలో రూ. 1,500 కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని, ఆయన అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలపై పోరాడుతున్నందుకు తనను ఇటీవల హైదరాబాద్ నుంచి కోల్ కతాకు బదిలీ చేయించారని సస్పెన్షన్ కు గురైన దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కళింగిరి శాంతి భర్త మదన్ మోహన్ ఆవేదన వ్యక్తంచేశారు. ఉండవల్లి నివాసంలో ప్రజాదర్బార్ కు విచ్చేసిన మదన్ మోహన్... మంత్రి లోకేశ్ ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. విజయసాయి రెడ్డి, అడ్వొకేట్ సుభాష్ కలసి తన భార్య శాంతిని లోబరుచుకుని విశాఖలో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు పెద్ద ఎత్తున భూములు కొల్లగొట్టారని చెప్పారు. 2022-23 మధ్య కాలంలో తనను ఏమార్చి అమెరికా పంపిన విజయసాయి... నా భార్య శాంతితో రహస్యంగా సహజీవనం చేసి మగబిడ్డను కన్నారని తెలిపారు. తనకు న్యాయం చేయాల్సిందిగా రాష్ట్రపతి, ప్రధాని కార్యాలయాలతో పాటు రాష్ట్ర హోంమంత్రి, డీజీపీలను కలిసి విన్నవించానని తెలిపారు. ఇప్పటివరకు తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి శాంతికి కలిగిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలని లోకేశ్ ను కోరారు. గత ప్రభుత్వ హయాంలో శాంతి అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసిన కాలంలో రూ. 20 కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించిందని చెప్పారు. కుంచనపల్లిలో రూ. 4 కోట్ల విలువైన విల్లా, జగన్ ఇంటి సమీపంలో రూ. 3 కోట్ల విలువైన ఇల్లు, విశాఖ సాగర్ నగర్ లో ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ తోపాటు ఆమెకు విలాసవంతమైన కార్లు ఉన్నాయని తెలిపారు. విశాఖలో విజయసాయి, సుభాష్, తన భార్య శాంతి కలిసి కొట్టేసిన రూ. 1500 కోట్ల భూములపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లోకేశ్ ను కోరారు. విజయసాయి కుట్రతో కోల్ కతా బదిలీ అయిన తనను తిరిగి హైదరాబాద్ కు ట్రాన్స్ ఫర్ చేయించాలని విన్నవించారు. మదన్ విన్నపం పట్ల లోకేశ్ సానుకూలంగా స్పందించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.