అడవుల అభివృద్ధి కోసం తన జీవితాన్నే ధారపోసిన పర్యావరణవేత్త తులసి గౌడ ఇకలేరు. 86 ఏళ్ల వయసులో వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో ఆమె డిసెంబర్ 16వ తేదీ సోమవారం సాయంత్రం కర్ణాటకలోని స్వగ్రామమైన హొన్నాలి నివాసంలో మృతి చెందారు. పద్మశ్రీ అవార్డు అందుకున్న తులసి గౌడ మృతితో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూనే.. ఆమె కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నారు.
1944 సంవత్సరంలో తులసి గౌడ కర్ణాటకలోని హొన్నాలి గ్రామంలో పుట్టారు. అయితే చిన్ననాటి నుంచే తులసి గౌడకు చెట్లు అంటే చాలా ఇష్టం. వాటిని పెంచేందుకు ఆమె చాలా ఆసక్తి కనబరిచేవారు. ఈక్రమంలోనే ఆమె అటవీ శాఖ నర్సరీలో రోజువారీ కూలీగా పని చేయడం ప్రారంభించారు. అలా పని చేస్తూనే వేలాది చెట్లు నాటి అడవుల పెంపకానికి ఆజ్యం పోశారు.
హలక్కీ గిరిజన సమాజానికి చెందిన తులసి గౌడ ఆరు శతాబ్దాలకు పైగా తన జీవితాన్ని పర్యావరణ పరిరక్షణ కోసం అంకితం చేశారు. అంకోలాతో పాటు పరిసర ప్రాంతాల్లో వేలాది చెట్లను నాటి ఆ ప్రాంతమంతటినీ పచ్చగా విరిసేలా చేసింది. ఇలా అక్కడి ప్రజలందరి దృష్టిలో పడిన ఈమెకు అందరూ చెట్టు తల్లి అని పేరు పెట్టుకున్నారు. అంతేకాకుండా తులసి గౌడకు చెట్లపై ఉన్న అసమానమైన జ్ఞానం వల్ల ఆమెకు "ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ప్లాంట్స్" అనే బిరుదును కూడా ఇచ్చారు.
తులసి గౌడ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం.. 2021లో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ప్రతిష్టాత్మక పద్శ శ్రీ అవార్డుతో సత్కరించారు. కాళ్లకు చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చి.. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి ఈమె అవార్డును అందుకొని.. అందరి కళ్లల్లో పడ్డారు. పద్మశ్రీ అవార్డు వరించడంతో ఈమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆ తర్వాతే ఆమె కృషిని మెచ్చిన ధార్వాడ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం.. డాక్టరేట్‌ను కూడా అందజేసింది. ఇది మాత్రమే కాకుండా తులసి గౌడ తన జీవితకాలంలో ఇందిరా ప్రియదర్శిని వృక్ష మిత్ర అవార్డుతో పాటు అనేక అవార్డులను సొంతం చేసుకుంది.
అయితే వృద్ధాప్య సంబంధిత సమస్యలతో 86 ఏళ్ల వయసులో తులసి గౌడ చనిపోగా.. ప్రధాని మోదీ సైతం సంతాపం వ్యక్తం చేశారు. ఎక్స్ వేధికగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. అలాగే తులసి గౌడ తన జీవితాన్ని.. వేలాది మొక్కలు నాటడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి అంకితం చేశారని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఆమె మార్గదర్శకంగా నిలుస్తారన్నారు. తులసిగౌడ చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. ఈమె పిల్లలు చనిపోవడంతో మనవళ్లే.. స్వగ్రామంలో మంగళవారం రోజు అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు సమాచారం.