ఏలూరు జిల్లా నూజివీడులో దివంగత నేత గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం పాలక టీడీపీలో అంతర్గతంగా కలకలం సృష్టించింది. ఈ కార్యక్రమంలో టీడీపీ కీలక నేతల మధ్య వైసీపీకి చెందిన మాజీ మంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేశ్ ప్రత్యక్షమై వారితో రాసుకుని పూసుకుని తిరగడం పార్టీ శ్రేణులను విస్మయపరచింది. టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు గుప్పించడంతో ఈ పరిణామాన్ని టీడీపీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ రాష్ట్ర కార్యాలయ బాధ్యులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్ ఆదేశించారు. అయితే జోగిని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆహ్వానించారని.. ఆయన్ను వివరణ అడగకపోవడంపై పార్టీ శ్రేణుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నూజివీడు గౌడసంఘం నేతలు ఆదివారం ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. లచ్చన్న మనుమరాలు గౌతు శిరీషతోపాటు నూజివీడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి, ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ తదితరులతో పాటు జోగి రమేశ్, గన్నవరం ఎంపీపీ, వైసీపీ నేత అనగాని రవి కూడా వచ్చారు. కాగా నూజివీడు కార్యక్రమంపై వివాదం చెలరేగడంతో మంత్రి పార్థసారథి సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పార్టీ అధిష్ఠానానికి, కార్యకర్తలకు క్షమాపణ చెప్పారు. ‘గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ పార్టీలకతీతంగా జరిగింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన గౌడ సామాజిక వర్గీయులందరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జోగి రమేశ్ రావడం యాదృచ్ఛికంగా జరిగింది. కూటమి నేతలెవరూ ఆయన్ను ఆహ్వానించ లేదు. బలహీన వర్గాలకు చెందిన నన్ను మంత్రిని చేసిన ఘనత చంద్రబాబుది. ఆయన, లోకేశ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నాను. పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని ఉంటే వారికి క్షమాపణ చెబుతున్నాను. మన్నించాలని ముఖ్యమంత్రికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా అని తెలిపారు.