ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరిహద్దుల్లో చైనా మరో కుట్ర.. డోక్లాం వద్ద 22 గ్రామాల నిర్మాణం, శాటిలైట్ చిత్రాల్లు గుర్తింపు

national |  Suryaa Desk  | Published : Wed, Dec 18, 2024, 08:31 PM

2020లో తూర్పు లఢఖ్ ప్రాంతంలోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైన్యం మధ్య చెలరేగిన తీవ్ర హింసాత్మక ఘటన.. రెండు దేశాల మధ్య ఎప్పటినుంచో ఉన్న ఉద్రిక్తతలను మరింత తీవ్రం చేసింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా క్షీణించగా.. భారత్-చైనా సరిహద్దుల వద్ద భారీగా సైన్యాన్ని ఇరుదేశాలు మోహరించాయి. అప్పటినుంచి ఇప్పటివరకు రెండు దేశాల మధ్య చర్చలు జరగ్గా.. ఇటీవలె ఆ గొడవ సద్దమణిగినట్లు రెండు దేశాలు ప్రకటించాయి. సమస్యాత్మక ప్రాంతాల నుంచి రెండు దేశాల సైనికులు.. వెనక్కి వెళ్లిపోయినట్లు అధికారులు ప్రకటనలు కూడా విడుదల చేశారు. ఇక రెండు దేశాల మధ్య గత కొన్నేళ్లుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టాయని సంతోషించేలోపే.. మరోసారి డ్రాగన్ తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. భారత్‌కు అతి సున్నిత ప్రాంతమైన చికెన్స్ నెక్ ప్రాంతంలో భారీగా నిర్మాణాలు చేపట్టినట్లు తాజా శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది.


భారత్‌- భూటాన్‌- చైనా ట్రై జంక్షన్‌ అయిన డోక్లాం విషయంలో గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌, చైనాల మధ్య తీవ్ర వివాదం కొనసాగుతోంది. ఇక భూటాన్‌కు చెందిన ఆ భూభాగంలో గత 8 ఏళ్లుగా చైనా 22 గ్రామాలు, స్థావరాలను నిర్మించినట్లు శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయి. అందులో 2020ల గల్వాన్ ఘర్షణ తర్వాత నుంచి డోక్లాం సమీపంలో కొత్తగా 8 గ్రామాలు ఏర్పాటు అయ్యాయని శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడవుతున్నాయి. అయితే ఆ గ్రామాలు చైనా సైనిక స్థావరాలకు దగ్గరగా ఉండటం ఇప్పుడు తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. ఆ 22 గ్రామాల్లో జివు అనే గ్రామం అతి పెద్దదని.. అది భూటాన్‌ పశ్చిక బయళ్లలో ఉన్నట్లు తెలుస్తోంది.


తాజాగా సరిహద్దుల్లో చైనా గ్రామాలు, స్థావరాలు వేగంగా నిర్మిస్తుండటం భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. భారత్‌కు అత్యంత వ్యూహాత్మకంగా ఉన్న డోక్లాం ప్రాంతంలో గత కొన్నేళ్లుగా చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటుండటం.. కీలకమైన సిలిగురి కారిడార్‌ (చికెన్స్‌ నెక్‌)కు భవిష్యత్‌లో ముప్పు తప్పదనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈశాన్య భారత్‌లోని 8 రాష్ట్రాలకు వెళ్లేందుకు రైలు, రోడ్డు మార్గాలు ఈ చికెన్స్ నెక్ ప్రాంతం నుంచే వెళ్తాయి. అంతేకాకుండా ఈశాన్య రాష్ట్రాలకు కీలకమైన పైప్‌లైన్లు, కమ్యూనికేషన్‌ వైర్లు కూడా అదే మార్గంలో ఉండటం గమనార్హం.


పశ్చిమ బెంగాల్‌లో ఉన్న ఈ ప్రాంతంలో వెడల్పు కొన్ని చోట్ల కేవలం 22 కిలోమీటర్ల మాత్రమే ఉంది. ఇది కూడా నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌లకు అత్యంత సమీపంలో ఉంది. మరోవైపు.. చైనాకు చెందిన చుంబీ లోయ ఈ ప్రాంతానికి అతి సమీపంలో ఉంటుంది. అయితే ఈ ప్రాంతంపై చైనా దాడి చేసి భారతదేశం నుంచి ఆ 8 ఈశాన్య రాష్ట్రాలను వేరు చేసే ప్రమాదం ఉందని సైన్యంతోపాటు విశ్లేషకులు గత కొన్ని దశాబ్దాలుగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ ప్రాంతంపై చైనా దాడి చేస్తే.. ఈశాన్య ప్రాంతాల్లో ఉన్న భారత సైన్యానికి.. ఆయుధాలు, ఇతర వస్తువులు సరఫరా చేయడం కష్టం అవుతుంది. ఇక డోక్లాం ట్రై జంక్షన్‌ వద్ద చైనా నిర్మిస్తున్న రోడ్డు సహా ఇతర నిర్మాణాలను ఇప్పటివరకు భారత్‌ అడ్డుకోవడానికి ఇది ఒక ప్రధాన కారణం.


అంతేకాకుండా అసలు డోక్లాం ప్రాంతం తమదే అంటూ చైనా వాదిస్తుండటంతో మరో వివాదం నడుస్తోంది. ఇదే విషయంపై 2017లో భారత్‌-చైనాల మధ్య 72 రోజుల పాటు సరిహద్దుల్లో తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ తర్వాత రెండు దేశాల మధ్య దౌత్యపరంగా చర్చలు జరపడంతో అప్పటికి ఆ సమస్య పరిష్కారం అయింది. ఆ తర్వాత ఇరుదేశాల బలగాలు వెనక్కి తగ్గినప్పటికీ.. గత కొంతకాలంగా విడుదల అవుతున్న శాటిలైట్ ఫోటోల ప్రకారం ఆ ప్రాంతంలో చైనా ఎప్పటికప్పుడు నిర్మాణాలను పెంచుకుంటూ పోతోందని అర్థం అవుతోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com