ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెలకు రూ. 15 వేల జీతం ఉన్నా పర్సనల్ లోన్.. టాప్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఇలా.. అర్హతలేంటి?

business |  Suryaa Desk  | Published : Wed, Dec 18, 2024, 10:17 PM

డబ్బులు మనకు ఎప్పుడు సడెన్‌గా పెద్ద మొత్తంలో అవసరం పడతాయో చెప్పలేం. ఇది ముందుగా ఊహించడం కష్టమే. కొన్ని సార్లు అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి వెళ్తే.. ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కుటుంబంతో కలిసి ఎటైనా దూరప్రాంతాలకు వెళ్లాలన్నా.. లేదా పెళ్లి సందర్భంలోనూ ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బంధువుల్నో, తెలిసిన వాళ్లనో అడిగితే.. అక్కడ దొరక్కుంటే.. బ్యాంక్ పర్సనల్ లోన్ బెటర్ ఆప్షన్. ఇప్పట్లో చాలా బ్యాంకులు చాలా వేగంగానే కస్టమర్లకు లోన్లు మంజూరు చేస్తున్నాయి. ప్రాసెస్ చేసేందుకు పెద్దగా టైమ్ తీసుకోవట్లేదు. డాక్యుమెంటేషన్‌తోనూ పెద్దగా పని లేకుండానే డబ్బులు చేతికి వస్తున్నాయి. పర్సనల్ లోన్ల కోసం తాకట్టుగా ఏం పెట్టం కాబట్టి ఇవి అన్‌సెక్యుర్డ్ లోన్లు అని చెప్పొచ్చు. అయితే.. ఇక్కడ లోన్ అర్హత కోసం మంచి క్రెడిట్ స్కోరు, ఆదాయం ఉండాలి.


ఒకవేళ మీ శాలరీ తక్కువగా ఉండి.. అప్పటికీ పర్సనల్ లోన్ కావాలనుకుంటే కాస్త కష్టమే కానీ తక్కువ జీతం ఉన్న వ్యక్తులకు కూడా టాప్ బ్యాంకుల్లో లోన్లు వస్తాయి. ఐసీఐసీఐ బ్యాంకులో కనీసం నెలకు రూ. 30 వేల జీతం ఉంటే వ్యక్తిగత రుణం వస్తుంది. దీంట్లో 10.85 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభం అవుతున్నాయి. రూ. 50 లక్షల వరకు లోన్ పొందొచ్చు. లోన్ టెన్యూర్ ఆరేళ్ల వరకు ఉంటుంది.


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో లోన్ పొందాలంటే కనీస వేతనం రూ. 25 వేలుగా ఉంది. ఇక్కడ గరిష్టంగా రూ. 40 లక్షల వరకు రుణం వస్తుంది. వడ్డీ రేట్లు 10.85 శాతం నుంచే మొదలవుతున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంకులోనూ రూ. 25 వేల జీతం ఉండాలి. ఇక్కడ వడ్డీ రేట్లు 10.99 శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇండస్‌ఇండ్ బ్యాంకులో లోన్ కోసం రూ. 25 వేల కనీస వేతనం ఉండాలి. ఇక్కడ వడ్డీ రేట్లు 10.49 శాతం నుంచి షురూ అవుతున్నాయి. రూ. 50 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కనీసం రూ. 15 వేల జీతం ఉంటే లోన్ పొందొచ్చు. ఇక్కడ వడ్డీ రేట్లు 11.45 శాతం నుంచి ఉన్నాయి. రూ. 30 లక్షల వరకు లోన్ వస్తుంది. ఈఎంఐ కోసం టెన్యూర్ ఆరేళ్లుగా పెట్టుకోవచ్చు. ఇదే యాక్సిస్ బ్యాంకులోనూ వర్తిస్తుంది. దీంట్లో రూ. 10 లక్షల వరకు గరిష్టంగా రుణం పొందొచ్చు. వడ్డీ రేట్లు 11.25 శాతం నుంచి ఉన్నాయి. టెన్యూర్ ఐదేళ్ల వరకు ఉంటుంది.


మీకు తక్కువ జీతం ఉన్నా.. సెల్ఫ్ ఎంప్లాయీ అయినా (తక్కువ సంపాదన) మీరు పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. మీరు లోన్ పొందేందుకు అర్హులేనా అనేందుకు బ్యాంకులు ఇక్కడ ముఖ్యంగా మీ ఉద్యోగం, జీతం చూస్తుంది. ఒకే సంస్థలో స్థిరంగా ఎక్కువ కాలం నుంచి పనిచేస్తున్నట్లయితే అప్పుడు లోన్ పొందే అవకాశాలు కాస్త ఎక్కువే ఉంటాయి. ఇంకా సిబిల్ స్కోరు ఇక్కడ 650కిపైన ఉండాలి. ఇంకా.. మీకు సిబిల్ స్కోరు తక్కువగా ఉన్నట్లయితే.. జీతం కూడా తక్కువే కాబట్టి.. ఇలాంటి పరిస్థితుల్లో వడ్డీ ఇంకా ఎక్కువే పడొచ్చు. వయసు 21 నుంచి 60 ఏళ్ల వరకు ఉండాలి.


తక్కువ శాలరీ ఉన్నా.. పర్సనల్ లోన్ అర్హతను మెరుగుపర్చుకునేందుకు కొన్ని టిప్స్ ఉంటాయి. వాటి గురించి మనం ఇప్పుడు చూద్దాం. తక్కువ వడ్డీ రేటుకే లోన్ పొందాలంటే మంచి సిబిల్ స్కోరు మెయింటెయిన్ చేయాలి. మంచి ఆదాయం, మెరుగైన సిబిల్ స్కోరు ఉన్న వ్యక్తిని కో- అప్లికెంట్‌గా పెట్టి లోన్ అప్లై చేసుకోవచ్చు. ఎక్కువ కాలం ఈఎంఐ చెల్లించేలా ఎంచుకోవచ్చు. మీకు ఇతర ఆదాయ వనరులు అదనంగా ఏమైనా ఉంటే సదరు ప్రూఫ్స్ సబ్మిట్ చేయొచ్చు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com