మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలక వర్గాలపై అవిశ్వాస తీర్మానం పెట్టే సమయాన్ని కుదించరాదని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. వాటి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి, నవంబరుల్లో పూర్తవుతున్నందున ప్రత్యేకంగా పనిగట్టుకుని ఎందుకు దించేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. కక్ష సాధింపులు అవసరం లేదని.. విలువలతో కూడిన రాజకీయాలు చేద్దామని ఆయన స్పష్టం చేశారు. గురువారమిక్కడ వెలగపూడి సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ సందర్భంగా స్థానిక సంస్థల పాలక వర్గాలపై అవిశ్వాసం పెట్టే విషయమై చర్చ జరిగింది. గతంలో అవిశ్వాసం పెట్టడానికి ఏడాది సమయం ఉండేది.
దానిని గత వైసీపీ ప్రభుత్వం మార్చి.. పదవీకాలం నాలుగేళ్లు పూర్తయ్యేవరకు అవిశ్వాసం పెట్టరాదని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అత్యధిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీల మేయర్లు, చైర్‌పర్సన్లుగా వైసీపీకి చెందిన వారే ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ సమయాన్ని కుదించడంపై కసరత్తు జరిగింది. అవిశ్వాస తీర్మానాలు పెట్టడానికి వీలు కల్పిస్తే వారందరినీ దించివేయడానికి అనేకచోట్ల టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పాలకవర్గాల పదవీకాలం రెండున్నరేళ్లు పూర్తికాగానే అవిశ్వాసం పెట్టడానికి వీలుకల్పిస్తూ పురపాలక శాఖ ఒక ప్రతిపాదనను కేబినెట్ ముందు ఉంచింది. పాలనపై దృష్టి పెడదామని, ఇప్పుడు అవిశ్వాస తీర్మానాలు పెట్టి ఉన్నవారిని దించే వ్యవహారాలు పెట్టుకోకపోవడం మంచిదని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ఇప్పుడున్న పాలక వర్గాలకు ఇంకా ఎంత గడువుందని మంత్రి పొంగూరు నారాయణను సీఎం అడిగారు. 79 మున్సిపాలిటీలు/కార్పొరేషన్ల పాలక మండళ్ల పదవీకాలం వచ్చే ఏడాది మార్చితో ముగుస్తుందని, మిగిలిన వాటికి నవంబరులో పూర్తవుతుందని ఆయన బదులిచ్చారు. ఇంత కొద్ది సమయం ఉన్నవాటిని దించాల్సిన అవసరం లేదని సీఎం తేల్చిచెప్పారు. చైౖర్మన్ వేరే పార్టీ అయినప్పుడు జడ్పీ సమావేశాల్లో తీర్మానాలు చేయడానికి ఒక్కోసారి ఇబ్బంది ఎదురవుతోందని ఒక మంత్రి అనగా.. ముందుగానే అందరితో మాట్లాడి సమన్వయం చేసుకోవాలని, దానికోసం చైర్మన్లను దించాల్సిన పని లేదని సీఎం సూచించారు. దీంతో ఆ ప్రతిపాదనను మంత్రివర్గం తిరస్కరించింది.