తీరప్రాంత పరిరక్షణకు పటిష్ఠ చర్యలు చేపడతామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శ్రీకాకుళం కలెక్టరేట్‌లో గురువారం జిల్లాస్థాయి తీరప్రాంత భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గత సమావేశంలో చర్చించిన అంశాలపై తొలుత చర్చించారు. కోస్టల్ పోలింగ్ స్టేషన్స్ గోడల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. సముద్రతీర ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నా.. ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. తీర ప్రాంతాల్లో హోర్డింగ్స్, బారువ, కళింగపట్నం ప్రాంతాల్లో లైఫ్ జాకెట్స్, బోట్లు అవసరమని సభ్యులు కోరగా, ఈ దిశగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు మత్స్యశాఖ జారీచేసే బయోమెట్రిక్ కార్డులు, ఆధార్ కార్డులు తీసుకువెళ్లడం లేదని, దీనిపై మత్స్యకారులకు అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. అలాగే సముద్ర తీరంలో జెట్టీలను ఏర్పాటు చేయాలని సభ్యులు కోరగా.. సంబంధిత పనులపై తక్షణ చర్యలు చేపట్టాలని మత్స్యశాఖ ఏడీని ఆదేశించారు. ఇంటర్‌నెట్ సౌకర్యం కూడా తీరప్రాంత గ్రామాలకు కల్పించాలని తెలిపారు. సమావేశంలో కోస్ట్‌ల్ గార్డ్ ఎస్పీ రవివర్మ, ప్రొగ్రామ్ మేనేజర్ పి.రాము, మత్స్యశాఖ ఏడీ పీవీ శ్రీనివాసరావు, సహాయ సంచాలకులు సంతోష్‌కుమార్, తీరప్రాంత సీఐలు, ఎస్‌ఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.