ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మంత్రులతో సీఎం మాట్లాడుతూ.. సున్నితమైన అంశాలపై ఒక్కోసారి మంచి ఉద్దేశంతో మాట్లాడినా, వాటిని వక్రీకరించే వారుంటారని చంద్రబాబు తెలిపారు. ఇదే సమయంలో గతంలో వ్యవసాయం దండగ అని తాను అనని మాటను అన్నట్లు తప్పుడు ప్రచారం చేసిన విషయాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు. ఇవాళ అంబేద్కర్ విషయమై ఢిల్లీలో జరుగుతున్న వ్యవహారం ఈ తరహాలోనే ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్‌కు తగిన గౌరవం లభించలేదని, అంబేద్కర్ ఎన్నికల్లో ఓడిపోయింది కాంగ్రెస్ హయాంలోనే అనే విషయాన్ని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. వీపీ సింగ్ హయాంలో పార్లమెంట్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని, అంబేద్కర్‌కు ఎవరి ద్వారా గుర్తింపు వచ్చిందనే తదితర అంశాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.