పార్లమెంట్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అంబేద్కర్‌ను అవమానించేలా ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు. ప్రతిగా బీజేపీ ఎంపీలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరిస్తోందని, అంబేద్కర్‌ను ఏ రోజూ అభిమానించని కాంగ్రెస్ ఈరోజు కపట ప్రేమ చూపిస్తోందంటూ బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు అమిత్ షా అంబేద్కర్‌ను అవమానించేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీపై బురదజల్లుతోందని ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. అంబేద్కర్‌పై బీజేపీకి ఎలాంటి ప్రేమ లేదనే విషయం అమిత్ షా వ్యాఖ్యలు సృష్టం చేస్తున్నాయని కాంగ్రెస్ అంటోంది. అంబేద్కర్ పేరు ప్రస్తావిస్తూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఘటనపై కాంగ్రెస్, బీజేపీ మధ్య వార్ మరెన్ని మలుపులు తిరుగుతుందనేది వేచి చూడాల్సి ఉంది.