విజయవాడలో నడక కోసం లయోలా కాలేజ్ వాకర్స్ పోరాటం ప్రారంభించారు. ఈ క్రమంలో లయోలా కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత 25 సంవత్సరాలుగా నగరవాసులు లయోలా కాలేజ్ వాకర్స్ పేరుతో లయోలా కాలేజీలో వాకింగ్ చేస్తున్నారు. అయితే కోవిడ్ సాకుతో కాలేజ్ యాజమాన్యం వాకర్స్‌ని కాలేజీలోకి రాకుండా ఆంక్షలు విధించింది. కేవలం ఐఏఎస్‌లు, ఐపీఎస్ అధికారులకు మాత్రమే నడిచేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో కాలేజీ యాజమాన్యం తీరుపై లయోలా కాలేజ్ వాకర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం తీరుకు నిరసనగా వాకర్స్ ఆందోళనకు దిగారు.ఈ విషయాన్ని వాకర్స్ స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ దృష్టికి తీసుకెళ్లినా.. సమస్య పరిష్కారం కాలేదు. దాదాపు 3 వేల మందిపై చిలుకు సభ్యులతో లయోలా వాకర్స్ క్లబ్ పెద్ద అసోసియేషన్‌గా ఉంది. కోవిడ్ సమయంలో వాకింగ్ ట్రాక్‌ను కళాశాల మూసివేసింది.
కోవిడ్ తర్వాత నుంచి వాకింగ్ ట్రాక్ తెరవాలంటూ అసోసియేషన్ ఒత్తిడి తీసుకువచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాకింగ్ ట్రాక్ తెరిపిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో వాకింగ్ ట్రాక్ తెరవాలంటూ లయోలా కళాశాల యాజమాన్యాన్ని ఎన్ని సార్లు కోరినా అనుమతి నిరాకరిస్తుండటంతో నగర వాసులు కళాశాల ముందు ధర్నాకు దిగారు. గేట్లకు తాళాలు వేసి ఉండటంతో వాటిని పగలకొట్టి గేట్లు తోసుకుంటూ లోనికి వెళ్లి నడక ప్రారంభించారు.