ఎన్నికల నిర్వహణకు ఓటరు జాబితా కీలకమని, ఓటరు జాబితా తయారీలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల జాబితా పరిశీలకుడు, మైన్స్ అండ్ జియాలజీ కమిషనర్, డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈఆర్‌వోలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా సంక్షిప్త సవరణ -2025 ప్రక్రియ పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఓటరు జాబితా సవరణ సక్రమంగా నిర్వహిస్తే ఎన్నికల నాటికి శుద్ధమైన ఓటరు జాబితా తయారవుతుందన్నారు. ఎన్నికల సంవత్సరంలో తొలగింపులు చేయడానికి ఎన్నికల కమిషన్ నుంచి ఆంక్షలు ఉంటాయని, ప్రస్తుతం ఎటువంటి ఆంక్షలు ఉండవని, ప్రతి అభ్యర్థనను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు.
పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, ప్రజల నుంచి వచ్చే వినతులకు నిర్ణీత సమయంలో నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపులపై రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రజలలో అవగాహన కల్పించాలని తెలిపారు. ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్వోలు బాధ్యతగా వ్యవహరించాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో చేపట్టిన ఓటరు జాబితా సవరణ వివరాలను కలెక్టర్ విజయకృష్ణన్ వివరించారు. 2024 అక్టోబరు 29న ప్రచురించిన డ్రాఫ్ట్ పబ్లికేషన్ ప్రకారం జిల్లాలో 6,27,566 మంది పురుషులు, 6,62,276 మంది స్త్రీలు.. మొత్తం 12,89,870 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. నూరుశాతం ఫొటో గుర్తింపు ఉందని, 99.99 శాతం మంది ఓటర్లకు ఓటరు కార్డు ఉందని చెప్పారు. ఈ నెల 24వ తేదీ నాటికి క్లయిమ్‌లు, అభ్యంతరాలు పరిష్కరిస్తామని, 2025 జనవరి ఒకటో తేదీకి ఓటరు జాబితా సిద్ధం చేసి ఎన్నికల కమిషన్ అనుమతితో 2025 జనవరి ఆరో తేదీన తుది జాబితా ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జేసీ ఎం.జాహ్నవి, డీఆర్‌వో సత్యనారాయణరావు, ఆర్డీవోలు, రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.