ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... కృత్రిమ మేధ (ఏఐ)లో ఏపీ యువతను నెం.1గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనలకు అనుగుణంగా ఈ ఒప్పందాలు జరిగాయని అన్నారు. అధునాతన ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడం, అందుకు ఏపీ యువతను సన్నద్ధం చేయడమే తమ లక్ష్యమన్నారు. పరిశ్రమల డిమాండ్, ప్రమాణాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్ మెంట్ పై యూనివర్సిటీ ఆఫ్ ఇన్నోవేషన్ దృష్టిసారిస్తుందని చెప్పారు. అధునాతన సాంకేతికత, విద్యను ఏకీకృతం చేయడానికి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ కృషి చేస్తుందని చెప్పారు. ఏఐలో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక, నెక్స్ట్ జనరేషన్ నైపుణ్యాలకు మార్గం సుగమం చేస్తున్నామని మంత్రి లోకేష్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత విద్య వ్యవస్థను ఆధునీకరించేందుకు టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ (TBI)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేసింది. ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఏపీ విద్యార్థులను తీర్చిదిద్దడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. అంతర్జాతీయంగా విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఏపీ ఉన్నత విద్యలో చేయాల్సిన మార్పులపై TBI ప్రభుత్వానికి సలహా ఇస్తుంది. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించే విద్యా విధానాలను గుర్తిస్తుంది. విశ్వవిద్యాలయాలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో తృతీయ విద్య ల్యాండ్ స్కేప్ ను మెరుగుపర్చడానికి కృషిచేస్తుంది. ఏపీలో సమగ్ర, స్థిరమైన ఆర్థికవృద్ధి వేదిక ఏర్పాటుకు అవసరమైన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. ప్రస్తుత వ్యవస్థలో నైపుణ్య అంతరాలను గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విధానాలను అమలుచేసేందుకు ఏపీ ప్రభుత్వంతో టీబీఐ కలసి పనిచేస్తుంది. ఇందుకు అవసరమైన సమగ్ర రోడ్ మ్యాప్ ను అభివృద్ధి చేయడంలో సహకరిస్తుంది.