అధునాతన సాంకేతిక ఆవిష్కరణల కేంద్రంగా ఎదిగేందుకు అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ లో డీప్-టెక్ ను అభివృద్ధి చేయడంలో భాగంగా ఏపీ ప్రభుత్వం రెండు ప్రధాన సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఈ రెండు ఒప్పందాలు జరిగాయి.ఫిజిక్స్ వాలా (PW) ఎడ్యుటెక్ కంపెనీ తన పరిశ్రమ భాగస్వామి అమెజాన్ వెబ్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ లో AI-ఫోకస్డ్ ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ (IoE)... యూనివర్సిటీ ఆఫ్ ఇన్నొవేషన్ (UoI)ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. మరోవైపు, రాష్ట్రంలో ఉన్నత విద్యను ఆధునీకరించేందుకు టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ (TBI)తో ఏపీ ప్రభుత్వం మరో ఒప్పందం చేసుకుంది. ఉండవల్లి నివాసంలో నారా లోకేశ్ సమక్షంలో ఫిజిక్స్ వాలా, టోనీబ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు వేర్వేరుగా ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ఇన్నోవేషన్ విశ్వవిద్యాలయం అకడమిక్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్స్ ను ఏకీకృతం చేసే దిశగా పని చేస్తుంది. పరిశోధన, విద్య, ఉపాధిలో కీలక సవాళ్లను పరిష్కరించడంపై దృష్టిసారిస్తుంది. హబ్-అండ్-స్పోక్ మోడల్‌ను అనుసరించి ఇన్నోవేషన్ యూనివర్సిటీ సెంట్రల్ హబ్‌గా పనిచేస్తుంది. దీని ద్వారా విభిన్న నేపథ్యాలు, ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు సమకాలీన, హైబ్రిడ్ విద్య అందుబాటులోకి వస్తుంది. ఆన్‌లైన్, వ్యక్తిగత అభ్యసన అనుభవాలను ఇంటిగ్రేట్ చేస్తారు.