ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం.. దర్యాప్తులో సంచలన విషయాలు

national |  Suryaa Desk  | Published : Fri, Dec 20, 2024, 09:02 PM

2021 డిసెంబర్ 8వ తేదీన జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్ మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ చేసిన ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ కీలక విషయాలను రాబట్టింది. దీనిపై రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ తయారు చేసిన నివేదిక తాజాగా లోక్‌సభ ముందు ఉంచింది. మానవ తప్పిదం కారణంగానే బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆ ఎంఐ-17 హెలికాప్టర్ కూలిపోయినట్లు అందులో ధ్రువీకరించారు. 2017 నుంచి 2022 వరకు మొత్తం 34 ఐఏఎఫ్ ప్రమాదాలు జరిగినట్లు రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ తన నివేదికలో వెల్లడించింది. 2021-2022 మధ్య 9 ప్రమాదాలు జరిగాయని.. ఇక 2021 డిసెంబర్ 8వ తేదీన జరిగిన ప్రమాదం మానవ తప్పిదం అని ప్యానెల్ తెలిపింది.


తమిళనాడులోని కూనూర్‌లో 2021 డిసెంబర్‌ 8వ తేదీన జరిగిన ఎంఐ-17 హెలికాప్టర్‌ ప్రమాదంలో అప్పటి సీడీఎస్‌ బిపిన్‌ రావత్ దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో బిపిన్ రావత్‌తోపాటు ఆయన సతీమణి మధులిక సహా మరో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ కాలేజీలో ప్రసంగించేందుకు.. తమిళనాడులోని సూలూర్‌ ఎయిర్‌బేస్‌ నుంచి బయల్దేరిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. ఆ రోజు ఉదయం రావత్‌ దంపతులు, ఆర్మీ అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తమిళనాడుకు చేరుకున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటలకు బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ-17 హెలికాప్టర్ ప్రమాదవశాత్తు అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న 14 మందిలో బిపిన్ రావత్‌ దంపతులు సహా అంతా మృతిచెందినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారిక ప్రకటన వెలువరించింది.


ఈ ప్రమాదం పూర్తిగా మానవ తప్పిదమేనని నివేదిక తేల్చింది. ఆ హెలికాప్టర్‌ లోయ ప్రాంతంలోకి వెళ్లిన తర్వాత వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయని.. దీంతో ఆ పైలట్ అయోమయంలో హెలికాప్టర్‌ను హఠాత్తుగా మేఘాల్లోకి తీసుకెళ్లడంతోనే అది కూలిపోయిందని తేల్చారు. ఫ్లైట్‌ డేటా రికార్డర్‌, కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డులను విశ్లేషించామని.. ఆ తర్వాత కొందరు ప్రత్యక్ష సాక్షులను కూడా విచారణ జరిపిన తర్వాత ఈ హెలికాప్టర్ ప్రమాదం జరగడానికి గల కారణంపై ఒక అంచనాకు వచ్చినట్లు స్టాండింగ్‌ కమిటీ ఆ రిపోర్ట్‌లో పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com